కాంగ్రెస్ క్రికెట్ లీగ్

ఆంధ్ర ప్రాంతంలో అనుమతులు లేకుండానే కోడి పందాలు ఆడుతున్నారు. అందులో నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎంతో మంది ఉన్నారు. మరి తెలంగాణలో తామేం తక్కువ తినలేదని నిరూపించేందుకు సిద్ధం అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.. అటు ప్రభుత్వం, ఇటు పోలీసుల అనుమతులు లేకుండానే క్రికెట్ పేరుతో ఆటగాళ్లను వేలంలో కొనేందుకు సిద్ధం అవుతున్నారు. మరి ఇదంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలుసో లేదో మరి…
బెల్లంపల్లి. ఈ నియోజకవర్గం పేరు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఎప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పేరు నానుతూనే ఉంటుంది. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన పనుల వల్ల రాష్ట్రంలో బెల్లంపల్లి పేరు తెలియని వారు లేకుండా పోయారు. ఆయన ఈ నియోజకవర్గాన్ని నిత్యం తాజాగా వార్తల్లో ఉంచేవారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వాటికి తావివ్వకుండా ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే వినోద్ సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తామెందుకు సైలెంట్గా ఉండాలనుకున్నారో ఏమో ఇప్పుడు ఓ పెద్ద చర్చకు దారి తీసేలా క్రికెట్ పోటీని తెరమీదకు తీసుకువచ్చారు.
బెల్లంపల్లి కేంద్రంగా ఓ క్రికెట్ పోటీ నిర్వహించాలని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, అదేదో స్మారక టోర్నమెంటో..? లేక ప్రైజ్‌మనీ ఇచ్చేదో నిర్వహిస్తే ఏ గొడవా ఉండేది కాదు.. ఇప్పుడు నిర్వహించే టోర్నమెంట్ ఆటగాళ్లకు వేలం పాట నిర్వహించి మరీ చేస్తున్నదన్న మాట. వాస్తవానికి ఇలా నిర్వహించడం గేమింగ్ యాక్ట్ ప్రకారం తప్పు. చట్ట విరుద్ధం. కానీ, తమది అధికార పార్టీ అన్న ధీమానో..? లేక మరేదైనా కారణమో కానీ.. శనివారం బెల్లంపల్లి పట్టణంలో ఆటగాళ్ల వేలం పాట నిర్వహించి ఈ టోర్నీ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అయితే, ఈ లీగ్ పోటీల్లో కాకా వెంకట స్వామి చాలెంజర్స్ పేరుతో ఎమ్మెల్యేను సైతం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత నాతరి స్వామి పేరుతో ఓ జట్టు ఏర్పాటు చేయనున్నారు . ఇందులో చాలా మంది కాంగ్రెస్ నేతలు ఉండటంతో పోలీసులు సైతం సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. కొందరు నేతలకు ఇది చట్టవిరుద్ధం అని తెలిసినా ఏం కాదులే అనే ధీమాతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇంతకు ముందు చెప్పినట్లు ఆంధ్రాప్రాంతంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కోట్లల్లో నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు ఆడుతున్నారు. మరి మనం లక్షల్లో ఆటడం తప్పేంటి అనుకున్నారో..? ఏమో… ? ఇక్కడి నేతలు..
ఇంతకీ ఇప్పటికిప్పుడు క్రికెట్ మీద నాయకులు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందంటే ఈ లీగ్ నిర్వహించాలనుకునే నాయకుల్లో చాలా మంది నామినేటేడ్ పదవులపై కన్నేశారు. వారికి పదవి రావాలంటే ఎమ్మెల్యే మెప్పు పొందాలి కదా… అందుకే ఈ కాంగ్రెస్ క్రికెట్ లీగ్ వెనక ఉన్న అసలు రహస్యం అన్న మాట. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్పష్టం చేశారు. దానిపై దృష్టి పెడతామని ఆయన నాందిన్యూస్‌కు తెలిపారు.