30 కోట్ల మంది పుణ్య స్నానాలు

Maha Kumbh Mela : మహా కుంభమేళా (Maha Kumbh Mela) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా ప్రకటించారు. కుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ 30 కోట్ల మంది త్రివేణీ సంగమంలో నదీ స్నానాలు ఆచరించినట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Maha Kumbh Mela)లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం వెల్లువలా తరలివస్తున్నారు.
అక్కడ నుంచి అయోధ్యకు..
కుంభమేళాకు వచ్చినవారు అక్కడ పుణ్య స్నానాల అనంతరం అయోధ్యకు బారులు తీరుతున్నారు. దీంతో అయోధ్య వీధులు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. జై శ్రీరామ స్మరణలతో అయోధ్య నగరం మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అప్రమత్తమైంది. రద్దీ నియంత్రణకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. కేవలం నాలుగు రోజుల్లోనే బాల రాముడిని దర్శనాలకు 65 లక్షల మంది అయోధ్య నగరంలోకి ప్రవేశించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అర్ధరాత్రి వరకూ భారీ క్యూలైన్ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శన సమయాలను అధికారులు పెంచారు. రోజులో 18 గంటల పాటు దర్శనాలకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ప్రతిరోజు రామాలయం, హనుమాన్ గర్హిని దర్శించే సుమారు 3 లక్షల మంది భక్తులకు వసతి కల్పిస్తుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు సూచనలు చేస్తున్నారు.