88 మంది బాలలకు విముక్తి

-అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం
-రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్ ఎం.శ్రీనివాస్ వెల్ల‌డి

Ramagundam Police Commissionerate: అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం అయ్యింద‌ని, ఆప‌రేష‌న్ స్మైల్ ద్వారా 88 మంది బాల‌ల‌కు విముక్తి క‌ల్పించిన‌ట్లు రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్ ఎం.శ్రీనివాస్ వెల్ల‌డించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాల ద్వారా తప్పిపోయిన, వదిలేసిన‌, బాల కార్మికులు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తిస్తామ‌న్నారు. అలా గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

దానిలో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-XI కార్యక్రమం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, ఇత‌ర అధికారుల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతంగా ముగిసిందన్నారు. ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్.ఐ, నలుగురు సిబ్బందిని నియమించి టీంలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు నిర్వ‌హించిన‌ ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమంలో భాగంగా 88 మంది బాల బాలికలను గుర్తించడమైనదని తెలిపారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో బాలురు-11, బాలికలు – 03 మొత్తం మంది – 14 మందిని గుర్తించామ‌ని, రెండు కేసులు నమోదు చేసిన‌ట్లు చెప్పారు. న‌లుగురు బాలకార్మికులని విముక్తి చేసి పాఠశాలలో చేర్పించిన‌ట్లు వెల్ల‌డించారు. మంచిర్యాల జిల్లా పరిధిలో బాలురు-55, బాలికలు – 19 మొత్తం మంది-74 మందిని గుర్తించామ‌న్నారు. ఒక‌ కేసు నమోదు చేసి ఇద్ద‌రు బాలకార్మికులని విముక్తి చేసి పాఠశాలలో చేర్పించిన‌ట్లు చెప్పారు.

ఈ సందర్బంగా క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామ‌ని తెలిపారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, ఎక్కడైనా పనిచేసిన, తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 (చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) వారికి మరియు డైల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాల‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like