ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది

MLA Prem Sagar Rao: తనకు తాండూరు ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. ఆయన విద్యాభారతి విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరుతో తన అనుబంధం విడదీయరానిదన్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారని, పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో వారంలోనే తాము అంతకంటే భారీగా మరో సభ నిర్వహించామన్నారు. మాజీ గ్రంథాలయ సంస్థ సల్వాజీ మహేందర్ రావు తనతో పాటు ఉన్నారని, మిగతా వారంతా కొత్త నేతలంటూ చెప్పుకొచ్చారు.
ఒక సింగరేణి మాజీ ఉద్యోగి ఆగమరావు విద్యాభారతి విద్యాసంస్థలు స్థాపించి అందరికీ చదువు అందించాలని తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభా పాటవాలు వెలికితీసేవి విద్యాలయాలు అని ప్రేంసాగర్ రావు స్పష్టం చేశారు. దేశంలో కేవలం రెండు సరస్వతి ఆలయాలు ఉంటే అందులో ఒకటి మన ఆదిలాబాద్ జిల్లాలో ఉండటం మనకు గర్వకారణమన్నారు. విద్యాభారతి విద్యాసంస్థలు మరింత ఎత్తుకు ఎదగాలని, ఎంతో మంది భావిభారత పౌరులను తయారు చేయాలని ఆకాక్షించారు. చిన్నారులు సైతం ఉపాధ్యాయులను గౌరవిస్తూ చదువుకుని ఉన్నతస్థానాలను అధిరోహించాలని కోరారు.
ఈ సందర్బంగా విద్యాభారతి పాఠశాల అధినేత శరత్ మాట్లాడుతూ గతంలో మంచిర్యాల జిల్లాను కాకతీయ యూనివర్సిటీ పరిధి నుంచి తప్పించి నిజామాబాద్ జిల్లా యూనివర్సిటీలో కలిసివేశారని అన్నారు. ఈ విషయంలో తాము దాదాపు పది మంది ఎమ్మెల్యేల చుట్టూ పనికాలేదన్నారు. కానీ, ప్రేంసాగర్ రావును కలవగానే ఆయన తమను తీసుకువెళ్లి కేవలం పది నిమిషాల్లో పనిచేయించారని గుర్తు చేశారు. విద్య పట్ల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు ఉన్న నిబద్దత అలాందని స్పష్టం చేశారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆ పని పూర్తి చేసిన ఎమ్మెల్యేకు మరోమారు కృతజ్ఞతలు తెలిపారు.