నేను మీ క‌లెక్ట‌ర్‌ని…

Yadadri Bhuvanagiri District collector: ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర ప‌డటంతో తెల్ల‌వారుఝామునే ఆ విద్యార్థి చ‌దువుకుంటున్నాడు. ఇంత‌లో త‌లుపుత‌ట్టిన శ‌బ్దం వినిపించ‌డంతో త‌లుపు తెరిచాడు.. ఎవ‌రంటూ ప్ర‌శ్నించాడు. నేను మీ క‌లెక్ట‌ర్‌ని అంటూ ప‌రిచ‌యం చేసుకున్న వ్య‌క్తి ఎలా చ‌దువుతున్నావంటూ ఆరా తీశాడు.. త‌న ఇంటికి క‌లెక్ట‌ర్ రావ‌డం ఏంట‌ని ఆ కుర్రాడు షాక్ అయ్యాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల‌న‌లో త‌న‌దైన ముద్ర వేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీల‌తో జిల్లా యంత్రాంగాన్ని హ‌డ‌లెత్తిస్తున్నారు. అదే స‌మ‌యంలో విద్యకు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్న ఆయ‌న విద్య కోసం ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నారు.తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభ తెలుసుకుంటున్నారు. తరగతి గదిలో చాక్ పీస్ పట్టి విద్యార్థులకు పాఠాలను కూడా బోధిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రభుత్వ హాస్టళ్ళను ఆకస్మిక తనిఖీ చేస్తూ ఆహార మెనూ పరిశీలిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించని ఉపాధ్యాయులు, సిబ్బందిని స‌స్పెండ్ కూడా చేశారు. తనతో పాటు జిల్లా అధికారులు.. ప్రభుత్వ హాస్టల్లో నిద్రించేందుకు హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

తాజాగా కలెక్టర్ హనుమంతరావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా రాత్రి సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో నిద్రించారు. తెల్లవారు జామున ఐదున్నర గంటలకు ఎలాంటి సమాచారం లేకుండా ఆయ‌న శేరి గూడెంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇంటి తలుపు తట్టారు. ఇంటి తలుపులు తీసిన విద్యార్థి భరత్ చంద్ర చారితో తాను కలెక్టర్ నని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి కలెక్టర్ ను చూసి అవాక్కయ్యాడు. భరత్ చంద్ర చారికి తండ్రి లేకపోవడంతో తల్లి కష్టపడి చదివిస్తోంది.

కుటుంబ ఆర్థిక స్థితిగతులు, పదవ తరగతి పరీక్షల కోసం ఎలా చదువుతున్నావని కలెక్టర్ అడిగి తెలుసు కున్నారు. పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి కలెక్టర్ సూచించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు సొంత డబ్బులను ఇస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఐదువేల రూపాయలను విద్యార్థి భరత్ చంద్ర చారికి అందించాడు. చదువుకునేందుకు స్టడీచైర్ తో పాటు రైటింగ్ ప్యాడ్ కలెక్టర్ అందించాడు. విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడుతుంటారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మీ అమ్మ.. నిన్ను కష్టపడి చదివిస్తున్నందుకు పదో తరగతిలో మంచి మార్కులు సాధించి వారికి సంతోషం ఇవ్వాలని కోరారు.

త‌మ ఇంటికి కలెక్టర్ రావ‌డం, ఉద‌యాన్నే త‌లుపుత‌ట్ట‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని విద్యార్థి భరత్ చంద్ర చారి ఆనందం వ్య‌క్తం చేశారు. మొద‌ట తాను అవాక్కయ్యానని, నమ్మలేక పోతున్నానని చెప్పాడు. తనకు పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని, మా ఇంటికి కలెక్టర్ రాకతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని భరత్ చంద్ర చెప్పాడు. తన కొడుకును ప్రోత్సహించడం పట్ల జిల్లా కలెక్టర్ కు విద్యార్థి తల్లి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like