ఒక్క‌ బైక్‌పై 311 కేసులు, ₹1.61 ల‌క్ష‌ల జ‌రిమానా

ఒక‌టి కాదు… రెండు కాదు… ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘ‌న కేసులు.. ఆ జరిమానా మొత్తం ₹ 1.61 ల‌క్ష‌లు… ఇదీ ఓ ట్రాఫిక్ ఉల్లంఘ‌నుడి నిర్వాహ‌కం.. బెంగ‌ళూరులో ఓ వ్యక్తి రికార్డు స్థాయిల్లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. అయినా ఆ వ్య‌క్తి ఆ జ‌రిమానాలు చెల్లించి మ‌రీ త‌న వాహ‌నాన్ని తీసుకువెళ్లాడు. ఇక ముందు ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతంలో పెరియాస్వామి అనే వ్యక్తికి ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ఉంది. ఆ వ్యక్తి త‌న వాహ‌నాన్ని(KA-05 JX-1344) న‌డుపుతూ యథేచ్ఛ‌గా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. పెరియాస్వామి నడిపే స్కూటర్‌పై రికార్డుస్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పోలీసులు నమోదు చేశారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణం, ప్రయాణంలో మొబైల్‌ వినియోగం, సిగ్నల్‌ జంపింగ్ తదితర కేసులు నమోదు చేశారు. ఇంత జ‌రిగినా పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేశారు. స్థానికంగా ఉండే యువకుడు పెరియాస్వామి తరచూ ఉల్లంఘనలకు పాల్పడటం గమనించాడు. ఇలా ఏడాది కాలంగా గమనిస్తున్న యువకుడు పెరియాస్వామి నడిపే స్కూటర్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ స్కూటర్‌ను ఇంకా ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించాడు.

స్కూటర్‌పై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలోని అతని పోస్టుకు జత చేశాడు. సోషల్ మీడియాలో యువకుడు పెట్టిన పోస్టు నిమిషాల వ్యవధిలో బాగా వైరల్ అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆగమేఘాల మీద చర్యలు చేపట్టారు. పెరియాస్వామి స్కూటర్‌పై 311 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రూ.1,61,500 చలాన్లను బెంగళూరు సిటీ మార్కెట్‌ ట్రాఫిక్‌ పోలీసులు విధించి వాహనాన్ని సీజ్‌ చేశారు. ఇదిలా ఉంటే మరుసటి రోజే పెరియాస్వామి తన స్కూటర్‌ను తీసుకెళ్లడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే ఆయనకు ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఇక మీదట ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు.

గత సంవత్సరం, సుధామనగర్ నివాసికి చెందిన ఒకే ద్విచక్ర వాహనంపై రికార్డు స్థాయిలో ₹ 3.2 లక్షల జరిమానాను పోలీసులు కనుగొన్నారు. తన స్కూటర్ సెకండ్‌హ్యాండ్ మార్కెట్ విలువ ₹ 30,000 మాత్రమే ఉన్నందున తాను చెల్లించలేనని వాహన యజమాని వాదించాడు. అయితే, ట్రాఫిక్ అధికారులు ఈఎంఐ ప‌ద్ద‌తిలో క‌ట్టాల‌ని సూచించారు. ఒక‌వేళ అలా క‌ట్ట‌క‌పోతే FIR నమోదు చేస్తామ‌ని హెచ్చ‌రిండంతో ఆ యువ‌కుడు ఆ మొత్తాన్ని వాయిదా ప‌ద్ద‌తిలో చెల్లించాడు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎంఎన్‌ అనుచేత్ మాట్లాడుతూ బెంగళూరులో ప్రస్తుతం 2,681 వాహనాలు ₹50,000 కంటే ఎక్కువ జరిమానాలు ఉన్నాయ‌ని తెలిపారు. వారందరి వ‌ద్దా జ‌రిమానా వ‌సూలు చేస్తామ‌ని వెల్ల‌డించారు. బెంగ‌ళూరులో ప్ర‌జ‌లు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏ విధంగా చేస్తున్నార‌నేది ఇది నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like