మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు

Applications For New Ration Card at Mee Seva Centers: కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అంతే కాదు, కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పులు అవసరమైనా వాటిని కూడా ఆన్‌లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం మీ సేవ కేంద్రాలు ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాలను సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటికీ కొనసాగుతుందని, దీనికి ఒక నిర్దిష్టమైన గడువు లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించి దాదాపు లక్ష కార్డులను పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో దాదాపు 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికీ దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. కార్డుల కోసం పెద్ద ఎత్తున ప్రజల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించనుంది.