మీ సేవలో దరఖాస్తుల ప్రక్రియ నిలిపివేత

Telangana: కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవ కేంద్రాల దరఖాస్తులు స్వీకరించాలని భావించిన ప్రభుత్వం దానిని నిలిపివేసింది. మీసేవ కేంద్రాల ద్వారా ప్రస్తుతం దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులకు స్పష్టం చేసింది. ప్రజాపాలన దరఖాస్తులు మ్యానువల్‌గా పరిశీలించిన తర్వాతనే మీ సేవా కేంద్రాల దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అటు ప్రజాపాలన దరఖాస్తులు, ఇటు మీసేవ దరఖాస్తులతో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతోనే ముందు ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు సమాచారం అందింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించి దాదాపు లక్ష కార్డులను పంపిణీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో దాదాపు 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికీ దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. కార్డుల కోసం పెద్ద ఎత్తున ప్రజల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇందులో వచ్చే ఇబ్బందుల దృష్ట్యా వెనకడుగు వేసింది.
అయితే, ఈ నిర్ణయాల పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారని, కులగణనలో వివరాలు తీసుకున్నారని, గ్రామ సభల పేరుతో ఒకసారి, ఇలా ఎక్కడ పడితే దరఖాస్తులు తీసుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీ సేవలో దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పి నిర్ణయం వెనక్కి తీసుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా నిలకడ లేని నిర్ణయాల వల్ల జనం ఇబ్బందులు పడే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు.