42 కోట్ల మంది పుణ్యస్నానాలు

Maha Kumbh mela: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్మాత్మిక వేడుక, ఈ భూమి మీదే అత్యధిక మంది జనాలు తరలి వచ్చే మహా కుంభమేళా 2025 (Maha Kumbh mela)కు భారీగా జనం తరలివస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 42 కోట్లు దాటింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీ వరకు జరగనుంది.
మహాకుంభమేళాలో శనివారం వరకు 42 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. త్రివేణి సంగం (గంగ, యమున,సరస్వతి నదుల సంగమం)లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేస్తున్నారు. కాగా మహాకుంభమేళా జనవరి 26న ముగియనున్నది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినా భక్తులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. మౌని అమావాస్య నాడు అత్యధికంగా ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇక సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది భక్తులు, వసంత పంచమి రోజున 2.7 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారు.
జనవరి 30న రెండు కోట్లకు పైగా భక్తులు, పౌష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది పవిత్ర నదీ స్నానం ఆచరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు పుణ్యస్నానం ఆచరించారు. వీరేకాక నటీనటులు హేమా మాలిని, అనుపమ్ ఖేర్, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్, కొరియోగ్రాఫర్ రెమె డిసౌజా తదితర ప్రముఖులు కూడా పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రయాగ్‌రాజ్ చేరుకుని పవిత్ర స్నానం ఆచరిస్తారని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను చేసింది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమానికి నెలవైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ (Prayagraj) ఈ మహా కుంభమేళాకు వేదిక. ఈ మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 40 కోట్ల మంది ప్రజలు తరలివస్తారని అంచనా వేశారు. కానీ 50 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని ఏర్పాట్లను చేసింది. ప్రయాగరాజ్ పరిసర ప్రాంతాల్లో 40 వేల మంది సిబ్బందితో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరాలతో సహా ఆధునాతన పరికరాలతో పోలీసులు పహారా కాస్తున్నారు. త్రివేణి సంగమంలో పడవలపై కూడా పెట్రోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఇక, భక్తుల బస కోసం ఏకంగా 1.50 లక్షల టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రయాగరాజ్ పరిసర ప్రాంతాల్లో 4.5 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కుంభమేళా కోసం పది వేల ఎకరాలను కేటాయించారు., ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు ఉండగలిగేలా ఏర్పాట్లు చేశారు.