టీటీడీలో ఇక వాట్స‌ప్ సేవ‌లు

WhatsApp Services in TTD : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌క్తుల‌కు సులువైన సేవ‌లు అందించే దిశ‌గా మ‌రో ముంద‌డుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఇప్పుడు నిత్యవసరంగా మారిన వాట్సాప్ ద్వారా దైవ దర్శనం సులభతరం చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. భక్తులు తమకు నచ్చిన రోజు దైవదర్శనం సులభంగా చేసుకునే వీలు కల్పించాలన్నది టీటీడీ ఆలోచిస్తోంది. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోకి టీటీడీ సేవ‌ల‌ను కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించిన నేప‌థ్యంలో ఆ వైపుగా టీటీడీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న ద‌ర్శ‌నం కోసం చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి సైతం భ‌క్తులు భారీ సంఖ్య‌లో వ‌స్తారు. ఈ ద‌ర్శ‌నాల కోసం ఎమ్మెల్యే మొదలు సీఎం పేషీ వరకూ రోజూ తిరుమల దర్శనం కోసం సిఫార్సు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో ఎలాంటి సిఫార్సులతో పనిలేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేలా ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు.

తిరుమల దేవస్థానం నుంచి వాట్సప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించి క్రమేణా అన్ని దేవాలయాల్లోనూ అందుబాటులోకి తీసుకు వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. తిరుమల దర్శనంతో పాటు ఇతర సేవలకు ఉన్న ధరలను సైతం ప్రక్షాళన చేసి తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఇప్ప‌టికే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడంలో టీటీడీ ముందు స్థానంలో ఉంటుంది. అనేక విప్లవాత్మక మార్పులకు టెక్నాలజీ వినియోగించి ఇతర దేవస్థానాలకు టీటీడీ ఓ రోల్ మోడల్‌గా నిలుస్తోంది. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను కల్పించాలన్న ధ్యేయంతో టీటీడీ ప్రతినిత్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది.

అడ్వాన్స్ రిజర్వేషన్ నుంచి…టికెట్ల విడుదల, గదుల కేటాయింపు, డొనేషన్స్, కళ్యాణ వేదిక, వివిధ రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24X7 పర్యవేక్షణ చేస్తూ వ‌స్తోంది. ఈ నిఘా నేత్రాలకు అత్యాధునిక అనలిటిక్స్ పరిజ్ఞానం జోడించి, తోపులాటలు జరగకుండా అప్రమత్తమయ్యేలా తిరుమలలో సీసీటీవీ టెక్నాలజీ వినియోగిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇక వాట్స‌ప్ ద్వారా కూడా సేవ‌లు అందుబాటులోకి వ‌స్తే ఖ‌చ్చితంగా అది సామాన్య భ‌క్తుల‌కు ఎంతో మేలు చేయ‌నుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like