దొంగ బాబా మోసం

Thief Baba’s fraud: నకిలీ బాబాల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజల ఆరోగ్యాలు బాగు చేయిస్తామని చెప్పి, డబ్బులు వచ్చేలా చేస్తామని నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య జనం వారి మాటలు నమ్మి ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాబా ఇలాగే ఓ వ్యక్తి దగ్గర ఆరోగ్యం బాగు చేయిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని నయం చేయకపోగా అన్ని రకాలుగా నష్టం కలిగేలా చేయడంతో ఏకంగా ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఖుర్షీద్‌నగర్‌కు చెందిన షేక్ అజారొద్దీన్ ఆరోగ్యం బాగుండేది కాదు. ఇంట్లో కూడా పరిస్థితులు బాలేక ఇబ్బందులు పడేవాడు. అతనికి యాసిన్ అలియాస్ డోంగీ బాబా అనే వ్యక్తి పరిచయడం అయ్యాడు. షేక్ అజారొద్దీన్ గురించి తెలుసుకున్న ఫేక్ బాబా యాసిన్ తాయెత్తు, పుర్రె బొమ్మతో ఉన్న పేపర్లు ఇచ్చాడు. ఆ పేపర్లు తలగడ కింద పెట్టుకుని పడుకోవాలని సూచించారు.
ఇలా 45 రోజులు పెట్టుకొని నిద్రిస్తే నయం అవుతుందని చెప్పాడు. రూ. 5 వేలు తీసుకున్నాడు. ఈ 45 రోజులు భార్యకు దూరంగా ఉండాలని చెప్పాడు. ఆ పేపర్లు తీసుకున్న తర్వాత అజారొద్దీన్ పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. పిచ్చిగా ప్రవర్తించడం, ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్ ధ్వంసం చేశాడు. అలా ప్రవర్తించడంతో ఆయన భార్య వెళ్లిపోయింది. తల్లి సైతం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో తాను మోసపోయానని గమనించిన అజారొద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్ద డబ్బులు తీసుకుని మాయమాటలు మోసం చేసిన దొంగ బాబాను అరెస్టు చేయాలని కోరాడు.
ఈ మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.