సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి అమ్మకాలు..
-11.75 లక్షల విలువైన 23.5 కిలోల గంజాయి పట్టివేత
-22 మందిపై కేసు నమోదు
-11 మంది నిందితుల అరెస్టు
-పరారీలో ముఠా నాయకుడుతో సహా 11 మంది

Cannabis sales under the guise of CC cameras business: బయటకు కనిపించేది అదో సీసీ కెమెరాల గోడౌన్.. కానీ అందులో జరుగుతున్నది మాత్రం గంజాయి వ్యాపారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ గంజాయి వ్యాపారాన్ని పోలీసులు చేధించి భారీగా గంజాయి పట్టుకున్నారు. ఈ ఘటనలో 22 మందిపైన కేసు నమోదు చేయగా, 11 మంది నిందితులను అరెస్టు చేశారు. ముఠా నాయకుడితో సహా మరో 11 మంది పరారీలో ఉన్నారు.
మంచిర్యాలలోని ఐబీ ఎక్స్ రోడ్డు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్ కింద సెల్లార్ లో సోమ ప్రవీణ్ అనే వ్యక్తి వై ఇన్ఫో సొల్యూషన్స్ పేరుతో సీసీ కెమెరాల వ్యాపారం నడిపిస్తున్నాడు. ఇందులో గంజాయి వ్యాపారం సాగుతోందని పోలీసులకు సమాచారం రావడంతో అక్కడ తనిఖీలు చేయగా, భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 11.75 లక్షల విలువైన 23.5 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ తరలించారు. ఇరుగురాళ్ల సతీష్ కుమార్, మహ్మద్ సమీర్, భీమ అనుదీప్, మొహమ్మద్ అబ్దుల్ ఉబేద్, అర్జున్ బాబురావు చౌహాన్, మహ్మద్ అజీజ్, జాడి రాఘవేంద్ర స్వామి, గూడూరు రాము, Sk అథాహుర్, sk సమీర్ ఉన్నారు. పరారీలో ఉన్న వారిలో సోమ ప్రవీణ్, తగరపు రాజు, తగరపు శృతి, తగరపు వినయ్, రామాలయం రాకేష్, శ్రీధర్, మున్నీ, చింటూ, అల్మేకర్ శ్యామ్, క్వార్టర్ సాయి, సోహెల్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
వీరు ఆంధ్ర ప్రాంతంలోనీ సీలేరు నుంచి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నారు. జనవరి నెల మొదటి వారంలో అందరూ తలా కొన్ని డబ్బులు వేసుకోని సీలేరు వెళ్లారు. అక్కడ కారులో తీసుకువస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులతో ఇబ్బందులు లేకుండా బైకులపై ఫాలో అయ్యారు. మళ్లీ ఫిబ్రవరి ఒకటో తేదీన కారులో మ్యాట్ల కింద, సీట్ల కింద కనపడకుండా దాచి మంచిర్యాల తీసుకువచ్చారు. ఆ గంజాయిని సోమ ప్రవీణ్ సీసీ కెమెరాల గోదాం లో దాచి ఉంచారు. ఇందులో కొందరు వ్యక్తులు దాదాపు పది కిలోల మేర అమ్మేందుకు తీసుకువెళ్లారు. పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఆ గోడౌన్ పై దాడి చేసి గంజాయి పట్టుకున్నారు. గంజాయిని తూకం వేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ కాంటా, సెల్ ఫోన్, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్ తరలించారు. ఈ ముఠా పైన NDPS ACT ప్రకారం సీఐ ప్రమోద్ కుమార్ కేసు నమోదు చేశారు. ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి న టాస్క్ఫోర్స్, మంచిర్యాల పోలీసు సిబ్బందిని రామగుండం కమిషనర్ C P శ్రీనివాస్ అభినందించారు.
పత్రిక సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, డీసీపీ అడ్మిన్ రాజు, ఏసీపీలురాఘవేంద్ర, ప్రకాశ్, మల్లారెడ్డి సీఐలు ప్రమోద్, రాజ్ కుమార్, రమేష్, టాస్క్ ఫోర్స్ S.I లు లచ్చన్న ఉపేందర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.