ప్రశ్నిస్తే చంపడం ఏంటి..? – సీతక్క

Minister Sitakka: హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై మంత్రి సీతక్క (Minister Sitakka) సీరియస్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో ఆమె మాట్లాడారు. ప్రశ్నిస్తే చంపేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షలతో ఇలా చంపేయడం సరైనది కాదన్నారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను సహించదని, ఇటువంటి హత్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. సామాజిక కార్యకర్తగా ఆయనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే చంపుతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక మాజీ మంత్రి అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా…? ఎవరు ఉన్నా హత్యకు కారకులైన ఎవరైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావులేదని మరోమారు స్పష్టం చేశారు. గతంలో పెద్దపల్లి జిల్లాలో సైతం ఇలాంటి హత్యలు జరిగాయన్నారు.
పదేండ్లు దోచుకుని ఇప్పుడు హత్యలు.. – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister komatireddy Venkatreddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదని, బీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీయాలను మానుకోండని హితవు పలికారు. దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి దిగజారారు. దోపిడి బయట పడుతుందని హత్యలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అడ్వకేట్ వామన రావును హత్య చేసిన వాళ్ళకే కేసీఆర్ టికెట్ ఇచ్చారని స్పష్టం చేశారు. రాజలింగమూర్తి హత్యను డైవర్ట్ చేసేందుకు హరీష్ రావు కృష్ణా నీళ్ల గురించి మాట్లాతున్నారన్నారు.