జ‌న‌క్ ప్ర‌సాద్ అబ‌ద్దాలు మానుకోవాలి

Singareni: INTUC నాయకుడు జనక్ ప్రసాద్ అవగాహన రాహిత్యంతో అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని, బీఎంఎస్ నాయకుడు లక్ష్మారెడ్డిపై నిరాధార ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ABKMS-BMS కార్యదర్శి పి. మాధవ్ నాయక్ డిమాండ్ చేశారు. ఆయ‌న ఈ మేర‌కు గురువారం ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. సీఎంపీఎఫ్ నిధులలో రూ. 727 కోట్లను డిహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని మాత్రమే తాము కోరుతున్నామ‌ని అన్నారు. మొత్తం రూ. 1390 కోట్లను సీఎం పీఎఫ్ డిహెచ్ఎఫ్ఎల్‌లో పెట్టుబడి పెట్టగా, ఆ సంస్థ దివాలా తీయ‌డంతో రూ. 727 కోట్లు సీఎం పీఎఫ్ ఖాతాకు తిరిగి రాలేదన్నారు. ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి, ఆ నిధులను సీఎం పీఎఫ్‌కు తిరిగి జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే కొత్త కాపు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

అయితే, డిహెచ్ఎఫ్ఎల్ సంస్థ యాజమాన్యం లేదా బినామీల గురించి ఎక్కడా ఆరోపించలేదని జనక్ ప్రసాద్ గమనించాలన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అవగాహన రాహిత్యంగా మాట్లాడటం ఆయనకు తగదని బీఎంఎస్ కార్యదర్శి మాధవ నాయక్ దుయ్య‌బ‌ట్టారు. లక్ష్మారెడ్డి సీఎంపీఎఫ్ బోర్డు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆ సంస్థలో జరుగుతున్న అనేక అవకతవకలను వెలికితీసి, ప్రత్యేకంగా డిహెచ్ఎఫ్ఎల్‌కు సంబంధించిన రూ. 727 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాం లో బొగ్గు గని కార్మికులకు కనీస పెన్షన్ గ్యారంటీ అంటూ లేకుండా పోయిందని, లక్ష్మారెడ్డి కృషి చేసి గత సంవత్సరం వేయి రూ.తగ్గకుండా కనీస పెన్షన్ ను సాధించారని ఈ విషయాన్ని జనక్ ప్రసాద్ గమనించాలన్నారు.

అలాగే, సీఎం పీఎఫ్ పెన్షన్ నిధి దీర్ఘకాల sustainability కోసం లక్ష్మారెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న, నిస్వార్థంగా సేవచేస్తున్న లక్ష్మారెడ్డి గురించి మాట్లాడే ముందు జనక్ ప్రసాద్ నిజాలు తెలుసుకోవాల‌ని కోరారు. డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తదితరుల మధ్య ఏవైనా సంబంధాల విషయమై తామేమీ ఆరోపించలేదన్నారు. తాము డిమాండ్ చేస్తున్నది కేవలం కార్మికుల కష్టార్జిత డబ్బు సీఎంపీఎఫ్ ఖాతాకు తిరిగి రావడం, ఈ కుంభకోణం బాధ్యులను కఠినంగా శిక్షించాలని మాత్రమే అన్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

జనక్ ప్రసాద్ కి నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల చైర్మన్‌గా, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పించడంలో ఎందుకు విఫలమయ్యారని..?ప్ర‌శ్నించారు. ఈ విషయాన్ని కార్మికులకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ ఆర్థికంగా రోజురోజుకు దిగజారుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థకు రూ. 35,000 కోట్లు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చూపుతోందని దుయ్య‌బ‌ట్టారు.

INTUC నాయకులు కాంగ్రెస్ రాజకీయ నేతల ప్రోద్బలంతో మాత్ర‌మే ఆరు ఏరియాల్లో గెలిచారని మాధ‌వ్ నాయ‌క్ స్ప‌ష్టం చేశారు. గుర్తింపు ఎన్నిక‌ల సంద‌ర్భంగా అనేక హామీలు ఇచ్చారని అన్నారు. కార్మికులకు సొంతింటి పథకం, ఇన్కమ్ టాక్స్ రియంబర్స్మెంట్, మారు పేర్లు సవరణ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని దుయ్య‌బ‌ట్టారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని… ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని… మ‌రి మీరు కార్మికుల కోసం ఏం చేశార‌ని..? ప్ర‌శ్నించారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ కబంధహస్తాల నుండి సింగరేణిని కాపాడే పని చేయాలని జనక్ ప్రసాద్ కి మాధ‌వ నాయ‌క్ హితవు ప‌లికారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like