ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత‌, కేటీఆర్‌, కేసీఆర్ ఏ పార్టీకి ఓటేస్తరు..?

CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత‌, కేటీఆర్‌, కేసీఆర్ ఏ పార్టీకి ఓటేస్తార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. సోమ‌వారం మంచిర్యాలలో నిర్వ‌హించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్య‌ర్థులే లేరన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేయమని చెబుతున్నారని, అసలు బీఆర్ఎస్ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో చెప్పాల‌ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఎజెండా ఏంటనీ, వీళ్ల కుట్రలు సమాజం గమనించాలని పట్టభద్రులకు సీఎం సూచించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచిందని, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడలేదా అని సీఎం ప్రశ్నించారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి తెచ్చింది ఏంటని, ఢిల్లీలో రెండు పార్టీల మధ్య ఏ ఒప్పందం జరిగిందని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని మోదీ చెప్పారని, కానీ అమ‌లు చేయ‌లేక చేతులు ఎత్తేశార‌ని అన్నారు. తెలంగాణ‌కు మాత్రం మోదీ రెండు ఉద్యోగాలు ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు. అందులో ఒక‌టి బండి సంజయ్ కి, రెండోది కిషన్ రెడ్డికి ఇచ్చార‌ని అవి కేంద్ర మంత్రి పదవులంటూ సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

You might also like