మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సులు.. జీవో జారీ

Telangana: మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో సైతం జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూ. 77, 220 చెల్లిస్తారు. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడిచే రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను లాంఛనంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన తుది కసరత్తు జరుగుతోంది.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తూ వారి ద్వారా కొనుగోలు చేసిన బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్డీసీ నిర్ణయించింది. మొదట 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయనున్నారు. వాటి నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు తదితర అంశాలన్నింటితో సమగ్ర నివేదిక సిద్ధం చేసిన అధికారులు దానిని ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడమే కాకుండా, జీవో సైతం జారీ చేసింది.