అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలకమైనది

International Women’s Day celebrations: కుటుంబాన్ని తీర్చిదిద్దడం నుంచి దేశాన్ని పాలించే వరకు అన్ని రంగాలలో మహిళల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం కలెక్టరేట్ లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు సామాజికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని గుర్తు చేశారు. దేశం ప్రథమ పౌరురాలి స్థానంతో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఆర్మీ, నేవి, ఎయిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రతి రంగంలో వారి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళలు సాధిస్తున్న విజయాలకు గుర్తించినిచ్చి మరింత ప్రోత్సాహించాలని అన్నారు. లింగ బేధం లేకుండా అబ్బాయిలను, అమ్మాయిలను ఒకేలా చూస్తూ సమాన అవకాశాలు కల్పించాలని, తద్వారా మహిళలు ఎదగడానికి ఎక్కువ అవకాశాలు అందుతాయన్నారు.
ఓర్పు, సహనంతో కుటుంబాన్ని తీర్చిదిద్దడంతో పాటు సంస్కారం కలిగిన భావితరాలను అందించడంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. మహిళలకు ఆత్మస్థైర్యమే గొప్ప ఆయుధమని, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక భద్రతా చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా ప్రోత్సహిస్తోందని తెలిపారు, అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని, ఆర్థిక స్వావలంబన పొందడంలో అనేక అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. డీసీపీ భాస్కర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్ మొదటగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికారులు, ఉద్యోగులను ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.