కొత్త క‌మిష‌న‌ర్‌గా అంబర్ కిషోర్ ఝా..

Ramagundam Police Commissionerate: రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్‌గా అంబర్ కిషోర్ ఝా(Amber Kishore Jha) సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ప‌ని చేసిన శ్రీ‌నివాస్ బ‌దిలీపై వెళ్లారు. ఆయ‌న‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. పోలీసు అధికారులు, సిబ్బంది వాహనం లాగి వీడ్కోలు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.

రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా సోమ‌వారం బాధ్యతలు స్వీకరించారు. ఆయ‌న సాయుధ పోలీసులు వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ క‌రుణాక‌ర్‌, ఇతర పోలీస్ అధికారులు నూతన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 గంటల పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సత్ప్రవర్తన, మంచి నడవడిక కలిగిన వారికీ, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతోపాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అందుబాటులో వున్న డీసీపీలతో పాటు తనను కూడా నేరుగా కలవచ్చన్నారు.

2009 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ ఝా 2011లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎఎస్పీగా 2012 వరంగల్ ఓఎస్డీ, అదనపు ఎస్పీగా పనిచేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొంది రాచకొండ జాయింట్ సీపీగా పనిచేశారు. అనంతరం వరంగల్ సీపీగా పనిచేశారు. ప్రస్తుతం రామగుండం పోలీస్ కమీషనర్ గా విధుల్లో చేరారు. నూతన సీపీని అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, మంచిర్యాల డీసీపీలు ఏ. భాస్కర్, కరుణాక‌ర్ త‌దిత‌రులు మర్యాదపూర్వకంగా క‌లిశారు.

ఎం. శ్రీ‌నివాస్‌కు ఘ‌నంగా వీడ్కోలు..
బదిలీ పై వెళ్తున్న ఎం. శ్రీనివాస్ కి పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు అధికారులు, సిబ్బంది వాహనం లాగి వీడ్కోలు తెలిపారు. గజమాలల‌తో సత్కరించి వాహనంలో హెడ్ క్వార్టర్స్ గేట్ వరకు సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎం. శ్రీ‌నివాస్ మాట్లాడుతూ…. రామగుండం పోలీస్ కమీషనరేట్ లో పని చేసిన సమయం, చేసిన కార్యక్రమాలు మరువలేనివన్నారు. సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కష్టపడుతూ అందరి సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పూర్తి చేశాన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like