పని చేయకున్నా చేసినట్లే లెక్క…

Manchryala District: మంచిర్యాల జిల్లాలో మొదటి నుంచి ఐసీడీఎస్ శాఖ అక్రమాలకు పెట్టింది పేరుగా మారింది. ఎంత మంది అధికారులు మారినా ఆ శాఖ పనితీరు మాత్రం మారడం లేదు. కిందిస్థాయి నుంచి మొదలుకుని పైస్థాయి వరకు అదే పరిస్థితి. అవినీతికి ఆలవాలంగా మారిన ఐసీడీఎస్ శాఖ గురించి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీడీఎస్ అంటేనే ఆడుతూ పాడుతూ విధులు నిర్వహించడంగా మారింది. కొన్ని సందర్భాల్లో పని చేయకున్నా చేసినట్లే అనే పరిస్థితి సాగుతోంది ఇక్కడ. జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేటలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల కేంద్రాలు సరిగ్గా నడవటం లేదు. చాలా చోట్ల టీచర్లు రాకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. కొన్ని చోట్ల ఫేస్ యాప్ ద్వారా టీచర్లు సక్రమంగానే హాజరు అవుతున్నారు. కానీ, కొన్ని చోట్ల దీనిని అమలు చేయకుండా అధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారు. మరి అక్కడ దానిని ఎందుకు పట్టించుకోవడం లేదనే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
వీరు రాకున్నా వచ్చినట్లే..
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా వారికే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు విధులకు గైర్హాజరైనా వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఓ అధికారి ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల ప్రాజెక్టుకు సంబంధించి దుబ్బపల్లి హెల్పర్ 2018 సెప్టెంబర్ నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఇక, దొరగారిపల్లి-3 ఉపాధ్యాయురాలు 2024 జులై నుంచి రావడం లేదు. మరోవైపు నస్పూర్ ప్రశాంతి నగర్ హెల్పర్ సైతం 2024 జనవరి నుంచి విధులకు హాజరు కావడం లేదు. వీరికి ఎన్నోమార్లు మెమోలు ఇచ్చినా సరైన స్పందన లేదు. అయితే, వీరి ముగ్గురిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఓ అధికారి ప్రయత్నాలు చేస్తున్నారు.
కలెక్టర్ ద్వారా తిరిగి రప్పించే ప్రయత్నాలు..
శంఖంలో పోస్తే తీర్థం అవుతుందన్న చందంగా ఈ ముగ్గురిని తీసుకోవాలని అధికారి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. దీంతో నేరుగా కలెక్టర్ ద్వారా వీరిని ఉద్యోగంలోకి తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ఆరోగ్యం బాలేదని, ఇంకా ఇతర కారణాలు చూపించి కలెక్టర్ ద్వారా తిరిగి పోస్టింగ్ ఇప్పించాలని చూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు వారికి సంబంధించిన ఫైల్ కలెక్టర్ టేబుల్ వరకూ వెళ్లలేదని సమాచారం. మరి ఈ వ్యవహారంలో కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.