పొలంలో విద్యుత్తు ఫెన్సింగ్ తగిలి కుమారుడి మృతి

సొంత పొలంలో పెట్టిన విద్యుత్ ఫెన్సింగ్ తగిలి కుమారుడు మృత్యువాత పడ్డాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తండ్రి మరో వ్యక్తితో కలిసి ప్లాన్ వేశాడు. చివరకు పోలీసులు తీగలాగడంతో డొంకంతా కదిలింది… కొమురంభీం జిల్లా సిర్పూర్ మండలం టోంకిని గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
గ్రామంలో నివసిస్తున్న చిరంజీవి అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. వారి పొలం చుట్టూ అటవీ జంతువులు రాకుండా విద్యుత్తు కంచె వేసుకున్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చిన్న కుమారుడు జయేందర్ (19)తో కలిసి చిరంజీవి చేనుకు వెళ్లాడు. కంచెకు తగిలిన జయేందర్ మృత్యువాత పడ్డాడు. దీంతో భయపడ్డ చిరంజీవి నేరం తనమీదికి వస్తుందేమోననే భయంతో… పక్క పొలానికి చెందిన చెలిరామ్ అనే వ్యక్తితో కలిసి మృతదేహాన్ని పెన్ గంగలో పడేశాడు. గురువారం ఉదయం కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికులు శనివారం నదిలో జయేందర్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై విద్యుత్తు తీగల గుర్తులు ఉండటంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. తండ్రిని విచారించడంతో నిజం ఒప్పుకొన్నాడు. చిరంజీవి, అతనికి సహకరించిన చెలిరామ్‌పై ఎస్సై కమలాకర్ కేసు నమోదు చేశారు.