యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై కేంద్రం నిషేధం

YouTube channels:పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, వీసాల రద్దు, పాకిస్థాన్ సినిమాలు నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్న భార‌త్‌, తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్‌ ఛానళ్లపై కూడా నిషేధం విధించింది. దాదాపు 16 యూట్యూబ్‌ ఛానళ్లపై (YouTube channels) వేటు వేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

పాకిస్థాన్‌కు చెందిన కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్‌ వ్యాప్తి, అలాగే భారత దేశం, సైన్యం, భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకొని తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. వీటిలో డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్‌, జియో న్యూస్‌ వంటి ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. ప్రముఖ వార్తా సంస్థ బీబీసీకి కూడా కేంద్రం నోటీసులు పంపింది. పాక్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడంతో నోటీసులు జారీ చేసింది

You might also like