ఆ పిల్లల పేర్లు… సింధూర్, సింధూరి..

Children Named As Sindoor, Sindoori:’ఆపరేషన్ సిందూర్’ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టేలా.. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయేలా చేసిన ఆపరేషన్.. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తమకు పుట్టిన పిల్లలకు ‘సింధూర్’, ‘సింధూరి’ అనే పేర్లు పెట్టుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన(బుధవారం) రోజున వివిధ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు సింధూర్, ‘సింధూరి’ అనే పేర్లు పెట్టుకుంటున్నారు. బీహార్‌లోని ఒక్క ఆసుపత్రిలోనే దాదాపు 12 మందికి ఇలా నామకరణం చేయడం గమనార్హం. ముజఫర్పుర్లోని కేజ్రీవాల్ చిల్డ్రన్ ఆస్పత్రిలో ‘ఆపరేషన్ సిందూర్’ జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు (ఆడ, మడ) దేశభక్తి చాటేలా వారి తల్లిదండ్రులు పేర్లు పెట్టారు. మగపిల్లలకు ‘సిందూర్’, ఆడపిల్లకు ‘సిందూరి’ అని నామకరణం చేశారు. కాతిహార్ జిల్లాలోని కుందన్ కుమార్ మండల్ తన కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా కేంద్రం సిందూర్ పేరుతో సైనిక చర్యకు పాల్పడిన రోజు.. పాప జన్మించిందన్నారు. అందుకే తమ పాపకు సిందూర్ అనే పేరు పెట్టామన్నారు. ఈ పాపకు సిందూర్ అంటే అర్థం ఇప్పుడే తెలియక పోవచ్చు. కానీ ఆమె పెరిగి పెద్దదైన తర్వాత ఆ పేరుకు ఆర్థం తెలుసుకుంటుందన్నారు.
హిమాన్షు రాజ్ కు సైతం పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ క్రమంలో తన కుమార్తెకు ‘సిందూరి’ అని నామకరణం చేశాడు. ప్రతి ఏటా తన కుమార్తె పుట్టినరోజుతో పాటు ‘ఆపరేషన్ సిందూర్’ను జరుపుకుంటానని చెబుతున్నాడు. “భారత సైన్యం శత్రువుపై దాడి చేసి దేశం గర్వపడేలా చేసిన రోజు నా ఇంటికి కూతురు రూపంలో ఆనందం వచ్చింది. ‘సిందూరి’ పేరు కుటుంబానికి గర్వకారణంగా మారడమే కాకుండా, సమాజంలో చర్చనీయాంశంగా మారింద”ని హిమాన్షు రాజ్ తెలిపాడు. జాఫర్పుర్కు చెందిన పవన్ సోనీకి మగబిడ్డ జన్మించాడు. తన కొడుకుకి సిందూర్ అని పేరు పెట్టాడు. “మా కొడుకు తన పేరు ద్వారానే దేశభక్తి స్ఫూర్తిని పొందాలని కోరుకుంటున్నాం. అతను పెద్దవాడై భారత సైన్యంలో చేరాలి. అది మా కల. ‘సిందూర్’ అనేది కేవలం ఒక పేరు కాదు. అదొక ఫ్యాషన్” అని సోనీ అభిప్రాయపడ్డాడు.
కేవలం ఈ ఒక్కచోటనే కాకుండా, దేశంలోని చాలా చోట్ల తమకు పుట్టిన పిల్లలకు ఈ పేర్లు పెట్టడం గమనార్హం. అది కేవలం పేరు మాత్రమే కాదని ఈ సిందూర్ పేరు ఆపరేషన్ విజయానికి చిహ్నంగా మారిందని చెబుతున్నారు. గతంలో ప్రజలు తమ పిల్లలకు హీరోలు, హీరోయిన్ల పేర్లు పెట్టేవారు. కానీ ఇప్పుడు వారు తమ దేశం గౌరవార్థం వారికి పేర్లు పెడుతున్నారని వెల్లడిస్తున్నారు.