బాసర ట్రిపుల్ ఐటీ అధికారుల హై అలెర్ట్

డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయని, వీటి పట్ల విద్యార్థులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకట రమణ పిలుపునిచ్చారు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో డిజిటల్ మోసానికి గురై ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ అధికారులు హై అలర్ట్ అయ్యారు. క్యాంపస్‌లో సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో శుక్రవారం బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఎస్‌ఏసీ (SAC) ఆడిటోరియంలో ‘సైబర్ నేరాలు – సైబర్ భద్రత’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

యువతను చిదిమేస్తున్న బెట్టింగ్ యాప్స్:
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌స్పెక్టర్ వెంకట రమణ మాట్లాడుతూ.. సోషల్ మీడియా మోసాలు, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్‌తో పొంచి ఉన్న పెను ప్రమాదాలను విద్యార్థులకు వివరించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడుతున్న యువత, ఆర్థికంగా చితికిపోవడంతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ లింకులు, ఫిషింగ్ మెసేజ్‌లు, ఓటీపీ (OTP) మోసాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయండి:
క్యాంపస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డీఎస్పీ వెంకట రామయ్య మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ఆర్థిక మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని తెలిపారు. దురదృష్టవశాత్తు ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం భయపడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే విశ్వవిద్యాలయ అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా ఎదగాలి: వీసీ
విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ మార్గదర్శకత్వం, పర్యవేక్షణలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ ఉన్నతికి, పరిశోధనలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ నేరాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమ సమన్వయకర్త డా. గుజ్జరి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వివిధ విభాగాల డీన్లు, అధిపతులు (హెచ్‌ఓడీలు), అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You might also like