విజయ్ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం, ఆలయ అధికారులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 20న తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తీవ్రమైన కోర్టు ధిక్కారంగా భావిస్తూ, ఈ రోజు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
తాము రాజ్యాంగ సంక్షోభాన్ని సహించమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు… “కోర్టు ఉత్తర్వులను ఎవరు నీరుగార్చాలని చూసినా సహించేది లేదు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని చూస్తే మేము సరిచేస్తాం” అని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఆదేశాల ఉల్లంఘన అని వ్యాఖ్యానించింది. కార్తీక దీపం పండుగ రోజున (నవంబర్ 24) కొండపై ఉన్న ‘దీపథూన్’ (రాతి స్తంభం) వద్ద దీపం వెలిగించనందున, నవంబర్ 28న అక్కడ దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలయ స్థానికుల (పూజారుల) సంప్రదింపులతో, ప్రస్తుతం వెలుగుతున్న అఖండ దీపం నుంచే జ్యోతిని తీసుకెళ్లి వెలిగించాలని స్పష్టం చేసింది.
దీపం వెలిగించే సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కేంద్ర బలగాలు, సీఆర్పీఎఫ్ (CRPF) సిబ్బందితో భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. సమీపంలోని దర్గాకు 50 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్గాకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకూడదని పేర్కొంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ (DGP), దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ మరియు సభ్యులకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార (Show Cause) నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా కలెక్టర్‌పై తీవ్రంగా మండిపడిన ధర్మాసనం.. “ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్‌గా మీదే కదా, ఆలయ బోర్డు తీర్మానం వెనుక దాక్కోవడం ఏమిటి?” అంటూ మధురై కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తిరుప్పరంకుండ్రం కొండపై సికందర్ బాదుషా దర్గాకు సమీపంలో ఉన్న పురాతన రాతి స్తంభం (దీపథూన్) వద్ద కార్తీక దీపం వెలిగించే అంశంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. నవంబర్ 24న కార్తీక దీపం రోజున ఒక్కసారి మాత్రమే అక్కడ దీపం వెలిగించేందుకు నవంబర్ 20న సుప్రీంకోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. అయితే, సంప్రదాయాలకు విరుద్ధమని ఆలయ బోర్డు నిరాకరించడంతో, అధికారులు కేవలం కొండ దిగువన ఉన్న ఉచ్చి పిళ్లైయార్ ఆలయ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించారు. దీనిపై పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఈ మేరకు సీరియస్ అయింది.