రాఫెల్‌తో రఫ్ఫాడిస్తున్న.. శివంగి సింగ్

Shivangi Singh:తల్లిదండ్రులు పెట్టిన పేర్లకు కొందరు పిల్లలు మాత్రమే సార్థకత తీసుకువస్తారు.. కొందరు మాత్రమే తమ పేరు నిలబెట్టుకుంటారు.. ఆ కోవకే చెందుతుంది శివంగి సింగ్.. కేవలం పేరులోనే కాదు.. ఇప్పుడు శత్రు మూకలపై విరుచుకుపడుతూ నిజంగానే శివంగిలా మారింది.. పాకిస్తాన్‌ను చెమటలు పట్టించే పనిలో నిమగ్నమైంది…
కఠినంగా ఉండే ఎంపిక, అంతకంటే కఠిమైన శిక్షణ ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో మగవాళ్లకే సాధ్యం కాని ప్రయత్నం.. కానీ, తను అన్నింటిని అలవోకగా అధిగమించింది… ఒకప్పుడు మహిళల ఉనికి అతి స్వల్పంగా పరిగణించే ఆ రంగంలో ఆమె తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. ఆమె శివాంగి సింగ్. ప్రస్తుతం వైమానిక దళంలో రాఫెల్ యుద్ధ విమానాన్ని(Rafale fighter jet) నడిపిన మొదటి మహిళ పైలట్ శివాంగి సింగ్. రఫెల్ విమానంతో పాకిస్తాన్ పై మెరుపు దాడులు చేస్తూ రఫ్ఫాడిస్తున్నారు.
కలలు కన్నది.. నిజం చేసుకుంది…
శివాంగి సింగ్ ది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శివాంగి సింగ్ మొదటిసారి ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకు వెళ్ళినప్పుడు, అక్కడ యుద్ధ విమానాలను చూసి కళ్ళు మెరిశాయి. ఆ క్షణంలోనే ఆమె ఒకరోజు నేను ఈ జెట్ విమానాలతో ఎగురుతాను అంటూ కలలు కన్నది. అప్పటికి ఆమె వయసు కేవలం తొమ్మది సంవత్సరాలు మాత్రమే.. శివాంగి వారణాసిలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఆ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) నుండి ఉన్నత విద్యను అభ్యసించింది. తరువాత హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి ప్రొఫెషనల్ శిక్షణ పొందారు. 2017లో భారత వైమానిక దళంలో చేరారు. రెండవ బ్యాచ్ మహిళా యుద్ధ పైలట్లలో నియమితులయ్యారు.
రాఫెల్ పైలెట్‌గా ఎంపిక..
వైమానిక దళంలో శివాంగి మిగ్-21 బైసన్ వంటి సూపర్సోనిక్ జెట్లను నడిపింది. పాకిస్తాన్‌లో దాడి జరిగినప్పుడు గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్ నడిపిన విమానం ఇదే. శివాంగి 2020లో రాఫెల్(Rafale fighter jet) వంటి అధునాతన యుద్ధ విమానాలను నడిపేందుకు ఎంపికైంది. ఈ ఎంపిక ఏ పైలట్ కైనా గర్వకారణం. ఎందుకంటే రాఫెల్ వైమానిక దళంలో అత్యంత వేగవంతమైన, అత్యంత ఆధునికమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇటీవల పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ నిర్వహించిన వైమానిక దాడిలో కూడా రాఫెల్ జెట్‌లను ఉపయోగించారు. ఈ ఆపరేషన్ లో శివాంగి సింగ్ కూడా చురుకుగా పాల్గొన్నారు. శివాంగి సింగ్ కథ కేవలం ఒక సైనిక అధికారి కథ మాత్రమే కాదు.. కలలు కనే అమ్మాయిలందరికీ ప్రేరణ..