భూభారతి దేశానికే ఆదర్శం
-భూభారతి చట్టం ప్రజలకు అంకితం
-రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు
-రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Minister Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలకు అంకితమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం భూభారతి చట్టం అమలులో భాగంగా మంచిర్యాల జిల్లా భీమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ధరణి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల అవసరాలను తీర్చి వారి సమస్యలను పరిష్కరించేందుకు దీనిని తీసుకువచ్చామన్నారు.
అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత ప్రజాభిప్రాయం సేకరించి, చట్టంలోని చిన్నచిన్న తప్పులను సవరించి ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని ప్రారంభించామన్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని 4 జిల్లాలలో 4 మండలాలను పైలట్ మండలాలుగా ఎంపిక చేసి, సమస్యలను జూన్ 2వ తేదీలోగా శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భీమారం మండలంలో సుమారు 2 వేల 200 దరఖాస్తులు రాగా ఇందులో దాదాపు 1 వేయి 100 దరఖాస్తులు సాదాబైనామా కు సంబంధించి ఉన్నాయని తెలిపారు. కోర్టు సెలవుల అనంతరం సమస్యలు పరిష్కరించి సాదా బైనామా దరఖాస్తులను పూర్తి చేస్తామని తెలిపారు.
భూభారతి చట్టంలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వస్థలాలు, రెవెన్యూ, అటవీ సంబంధిత భూములపై సంయుక్త సర్వే నిర్వహించి శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి అని, ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న వారిలో అర్హులైన నిరుపేదలను గుర్తించి నివేదిక పంపించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ సమయంలో సరిహద్దులతో పాటు, సర్వే మ్యాప్ లతో రిజిస్ట్రేషన్ చేస్తారని స్పష్టం చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలలో సైతం ఈ మ్యాప్ ఉంటుందని వెల్లడించారు.
జూన్ 2 నుండి తహసిల్దార్ స్థాయి అధికారులు మండల పరిధిలో పర్యటించి గ్రామాలలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్నట్లుగానే ప్రతి రైతుకు భూధార్ కార్డు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి రైతుకు భూధార్ ఖాతా నెంబర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. లావుని పట్టా, ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అన్యాక్రాంతానికి గురైన పేదల భూములను వెనక్కి తీసుకొని పేదలకు అందిస్తామన్నారు. అధికారులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఆ అధికారిపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా చట్టంలో పొందుపరిచామన్నారు.
నిరుపేదల కోసం నియోజకవర్గానికి 3 వేల 500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు అందించినట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వచ్చే మూడున్నర సంవత్సరాల కాలంలో మొత్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేకానంద, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ హాజరయ్యారు.