ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్
India: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ఇది ఆర్థిక ప్రగతిలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా అంచనాల ప్రకారం, భారతదేశం 2025లో $4.187 ట్రిలియన్ జీడీపీతో జపాన్‌ను అధిగమించింది. IMF ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ ప్రకారం, భారత జీడీపీ $ 4.187 ట్రిలియన్ కాగా, జపాన్ జీడీపీ $ 4.186 ట్రిలియన్‌గా ఉంది. ఇది భారతదేశ ఆర్థిక ప్రస్థానంలో కీలక ఘట్టంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2024లో భారత్ ఐదవ స్థానంలో ఉండగా, జపాన్ నాలుగవ స్థానంలో ఉంది. ఏడాది వ్యవధిలోనే భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెంది నాలుగో స్థానానికి ఎగబాకింది.
2025లో భారతదేశ వాస్తవిక జీడీపీ వృద్ధిరేటు 6.3%గా ఉండనుందని IMF అంచనా వేసింది. ఇది గత అంచనా 6.5%తో పోలిస్తే కొద్దిగా తక్కువైనా, భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. 2026లో 6.2%, 2027లో 6.3% భారత్ వృద్ధిరేటు ఉంటుందని IMF ఊహిస్తోంది. దీని వెనుక దేశీయ డిమాండ్ పెరుగుదల తదితరాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.ఇదే సమయంలో, జపాన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో ఉంది. 2025లో జపాన్ వృద్ధిరేటు 1.1% నుంచి 0.6%కి తగ్గించారు. అమెరికా నుండి వర్తక పరిమితులు, జపాన్ అంతర్గత సమస్యలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనాభా, ఉద్యోగ భద్రతల లోపం దీనికి ప్రధాన కారణాలుగా అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భవిష్యత్తులో భారతదేశం జర్మనీ, జపాన్‌లను పూర్తిగా అధిగమించే అవకాశం ఉందని IMF చెబుతోంది. 2030 నాటికి భారత జీడీపీ $6.8 ట్రిలియన్‌ను చేరి, జర్మనీ కంటే 20% ఎక్కువగా, జపాన్ కంటే 33% అధికంగా ఉండనుంది. ఇప్పటికే 2020లో బ్రిటన్‌ను అధిగమించిన భారత్, అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ, ప్రపంచ ఆర్థిక రంగంలో తన స్థానం బలపరచుకుంటూ వస్తోంది. భారతదేశం సాధించిన ఈ విజయాన్ని చూసి, ప్రపంచం భారత్‌ను గణనీయమైన ఆర్థిక శక్తిగా అంగీకరిస్తోంది. దేశీయ స్థాయిలో జరిగిన అభివృద్ధి మార్పులు, ప్రజల పొదుపు దృష్టి, యువత ఆధారిత జనాభా ఈ వృద్ధికి బలమైన ఆధారాలు.ఇది భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా చెబుతున్నారు.