పొజిషన్‌లో ఉన్నా… అపోజిషన్‌లో ఉన్నా.. తెలంగాణనే ఫస్ట్
BRS Silver Jubilee celebrations in Dallas: మహాత్ముని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్ ఒక్కడిగా బయల్దేరి, అవమానాలు అధిగమించి తెలంగాణ సాధించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నామని చెప్పారు. అమెరికా డాలస్(Dallas)లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో తెలంగాణ ఆవిర్భావ సంబురాలు, బీఆర్‌ఎస్ రజతోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా అదే ఉద్యమ స్పూర్తితో పనిచేశారని వెల్లడించారు.
స్వరాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలుపుకోవడంలో ఏ అవకాశాన్ని వదులుకోలేదని చెప్పారు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నామన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, అద్భుతమైన అక్షయపాత్రగా అవతరించిందని గుర్తు చేశారు. ఎప్పుడూ మితిమీరి అప్పులు చేయలేదని చెప్పారు. కరోనా కాలంలోనూ తెలంగాణను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లామని కేటీఆర్ వివరించారు.
తుంగతుర్తి, డోర్నకల్, మహబూబ్‌సాగర్‌కు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనేనన్నారు. 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అక్షయ పాత్ర కాళేశ్వరమని. 371 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని విషప్రచారం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి వాడుకలోకి తేవాలని కోరుతున్నానని వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 10 శాతం పనులు మిగిలిపోతే పూర్తిచేయడం లేదని, కేసీఆర్‌కు పేరు వస్తుందనే మిగిలిన పనులను పూర్తి చేయడం లేదన్నారు.