రైతు భరోసా.. 9 వేల కోట్లు

Rythu Bharosa Scheme in Telangana :తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేపటి నుండి రైతుభరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎకరానికి ఒక్కో సీజన్‌కు రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. రాష్ట్రంలోని కోటి 49 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యభూములకు సంబంధించి 70 లక్షల 11 వేల 984 మంది రైతుల ఖాతాలలో 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణలో అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా ఆర్థిక సహాయం రేపటి నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయగా.. విడతల వారీగా ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. నేడు ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ అయ్యాయి. ఎకరాలతో సంబంధం లేకుండా.. అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఎకరాలతో సంబంధం లేకుండా..
రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. తొలి విడత ఎకరం, తర్వాత రెండు ఎకరాలు, తర్వాత మూడు ఎకరాలున్న రైతులకు ఈపెట్టుబడి సాయం గతంలో అందించింది. ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విడతల వారీగా కాకుండా గతంలో గుర్తించిన లబ్దిదారులకు ఈ దఫా అందరికీ రైతు భరసా నిధులను మంజూరు చేయాలని నిర్ణయించారురు. ఈ నిర్ణయం ద్వారా రైతులకు ఎంతో మేలు జరగనుంది.
తొమ్మిది వేల కోట్ల రూపాయలు..
రాష్ట్రంలోని కోటి 49 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యభూములకు సంబంధించి 70 లక్షల 11 వేల 984 మంది రైతుల ఖాతాలలో 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. రైతు భరోసా ఇప్పటి వరకూ 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. తెలంగాణలో రైతు భరోసా నిధులు సాగుకు వీలయ్యే అన్ని భూములకు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దాదాపు 1.49 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి ఈ దఫా కూడా రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. దాదాపు నెల నుంచి కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం నిధులను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రేపటి నుంచి రైతు భరోసా నిధులు జమఅవుతాయని వెల్లడించారు.