మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల

Rythu Bharosa in Telangana : మూడు ఎకరాల వరకు రైతుభరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు (మంగళవారం) రూ.1551.89 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశామని ప్రకటించింది. 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధుల జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతుభరోసా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులందరికీ రైతుభరోసా ఇస్తామన్నారు.
సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి రైతుభరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎకరానికి రూ.6 వేల చొప్పున అర్హులైన రైతన్నలకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. సోమవారం ఒక్క రోజే 44.25 లక్షల మంది రైతులకు రూ.2,349 కోట్లు జమ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 9 రోజుల్లోపు అర్హులైన రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ శాఖ ప్రణాళికతో ముందుకెళుతోంది. రైతు భరోసా నిధుల జమ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.