సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

-మారిన మార్కెట్ పరిస్థితిలకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి
-బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి
-సింగరేణి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni:45 వేలకు పైబడిన ఉద్యోగులున్న ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధి అందించే సింగరేణి బలోపేతమే త‌మ‌ ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సింగరేణి సంస్థ లాభాల్లో న‌డుస్తూ ఉద్యోగులు, సింగరేణి ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఆలోచన అన్నారాయ‌న‌. గతంలో బొగ్గు రంగంలో సింగరేణి, కోల్ ఇండియాది ఏకచత్రాధిపత్యంగా ఉండేద‌ని కానీ ఇటీవలప్రపంచ వ్యాప్తంగా బొగ్గు రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో మార్కెట్లో పోటీకి తట్టుకొని సింగరేణి నిలబడాల్సిన అవసరం ఉందని భ‌ట్టి అభిప్రాయపడ్డారు.

ప్రైవేట్ కంపెనీల బొగ్గు ఉత్పత్తి వ్యయం, ఆ కంపెనీలు బహిరంగ మార్కెట్లో బొగ్గు ఏ ధరకు అమ్ముతున్నాయి..? సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్లో సింగరేణి బొగ్గుకు ఉన్న ధర ఎప్పటికప్పుడు పోల్చుకోవాలని చెప్పారు. ఈ ఉత్పత్తి వ్యయం, మార్కెట్లో బొగ్గు ధరలకు సంబంధించిన వివరాలను సింగరేణి కార్మికులకు అవగాహన కలిగేలా గ‌నుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, సింగరేణి కార్మికులు, అధికారులకు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం సూచించారు.

ఇదంతా ఒక భాగమైతే మైనింగ్ రంగంలో 136 సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణి కంపెనీ బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టి లాభాలు ఆర్జించే ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రపంచంలో ఉన్న క్రిటికల్ మినరల్స్ ఉన్న డిమాండ్ ఎంత అన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్స్ ను నియమించుకోవాలని సూచించారు. భవిష్యత్తు గురించి ఆలోచన చేయకపోతే ముందు తరాలకు నష్టం చేసినట్టు అవుతుందన్నారు.

సింగరేణిలో పూర్తిగా వ్యాపారమే కాదు మానవీయ కోణం కూడా ఉండాలని తెలిపారు. సింగరేణి మైన్ కార్యకలాపాలు జరిగే ప్రాంతం మొత్తం వరకు అక్కడి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఇటీవల కల్పించామ‌ని, సింగరేణిలోని శాశ్వత ఉద్యోగులకే కాదు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తున్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. సమీక్ష సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like