పార్టీ నుంచి రావి శ్రీనివాస్ సస్పెన్షన్

Congress: సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్ (Sirpur Congress Party In-charge Ravi Srinivas)పై ఆరేండ్ల పాటు వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్‌చార్జీ మంత్రి సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై రావి శ్రీనివాస్ విమర్శలు చేశారు. అంతేకాకుండా మీడియా ముందు బహిరంగ ఆరోపణలు చేశారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో సైతం సక్రమంగా పాల్గొనడం లేదని గ్రహించిన కాంగ్రెస్ ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్ ను పార్టీ నుంచి తొలగించాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా (Komuram Bhim Asifabad District) డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు(DCC President Vishwaprasad Rao) పార్టీ క్రమ శిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన అప్పటి టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి లేఖ రాశారు. రావి శ్రీనివాస్ మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ విఠల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగేలా ఆరోపణలు చేశారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీసీ కులగణన సర్వే కార్యక్రమాన్నిఅడ్డుకోవాలని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దురుసుగా ప్రవర్తించారని, ఎమ్మెల్సీ దండే విఠల్ పై అనుచిత వాఖ్యలు చేసి పార్టీ పరువు పోయే విధంగా ప్రవర్తించారని లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, కొడుకుతో పాటు మరికొందరు నేతలపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన వ్యవహారాన్ని విశ్వప్రసాద్ పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ ఇన్‌చార్జీ అయ్యి ఉండి పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అహంకారపూరితంగా వ్యవహరించడంతో పార్టీకి నష్టం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశంలో పాల్గొనక పోగా ప్రత్యర్థి పార్టీ బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు చెప్పాడని అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న పార్టీ క్రమ శిక్షణ కమిటీ రావి శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రావి శ్రీనివాస్‌పై ఆరేండ్ల పాటు బహిష్కరణ వేటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.