సమ్మె ఎవరి కోసం…?
సింగరేణిలో ప్రస్తుతం సమ్మె వేడి కొనసాగుతోంది. డిసెంబర్ 9న సమ్మె చేస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రకటించడంతో వేడి రాజుకుంది. ఐదు డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు సైతం అందచేసింది. టీబీజీకేఎస్ పెట్టిన డిమాండ్లపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. అందులో ఒక్క డిమాండ్ మినహా గుర్తింపు సంఘం గా ఆ యూనియనే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలనే ఇప్పుడు డిమాండ్ల రూపంలో సమ్మెకు వెళ్లడం పట్ల ఆ యూనియన్‌పై కార్మికుల్లో వ్యతిరేకత ఎదురవుతోంది.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణిలో సమ్మె చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో బొగ్గు గనుల్లోని బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధికార గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సింగరేణి బోర్డు యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. కల్యాణ్ ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసిందని దానిపై పోరాటం చేస్తామని టీబీజీకేఎస్ తెలిపింది. ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 9 నుంచి సమ్మె చేపట్టాలని టీబీజీకేఎస్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారు పెట్టిన డిమాండ్లలో అన్ని చర్చల ద్వారా పరిష్కారం అయ్యేవే తప్ప సమ్మె వరకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యూనియన్‌పై కార్మికులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
-కేంద్రం బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకున్నది 2017లో. గనుల చట్ట సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కల్వకుంట్ల కవిత ఎంపీగా సభలోనే ఉన్నారు. కాంగ్రెస్ పలు షరతులతో ఆ బిల్లుకు మద్దతు చెప్పగా, టీఆర్ఎస్ బేషరతుగా మద్దతు తెలిపింది. మరి అలాంటప్పుడు దానికి వ్యతిరేకంగా ఎలా సమ్మె చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
-ఇదే బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మె చేశాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అప్పుడు వారికి మద్దతు చెప్పాల్సింది పోయి సమ్మె విచ్ఛినం చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
-గనుల ప్రైవేటీకరణ చేస్తే కేంద్రం వాటా తామే తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరి ఇప్పుడు దాని విషయంపై ఎలాంటి ప్రకటన ఎందుకు చేయడం లేదని కార్మికులు అడుగుతున్నారు.
-35 సంవత్సరాల వయో పరిమితి 40 సంవత్సరాలకు పెంచి వన్ టైం సెటిల్ మెంట్ కింద డిపెండెంట్లందరికి ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టిన డిమాండ్ కూడా పాతదే. గతంలో ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎప్పుడో హామీ ఇచ్చారు. మరి ఈ విషయం ముఖ్యమంత్రికి, సింగరేణి యాజమాన్యానికి చెప్పి గుర్తింపు సంఘంగా చర్చల ద్వారా పరిష్కరించుకోకుండా సమ్మె నోటీసులో ఈ అంశం చేర్చడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-కార్మికుల వయోపరిమితి, పేర్ల మార్పు అలియాస్ పేర్లతో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి 2017 జనవరిలో సీఎం ప్రత్యేక కార్యదర్శి నర్సింగరావు ఫైల్ పంపించారు. అప్పటి వరకు ఇప్పటి వరకు వేలాది మంది కార్మికులు రిటైర్ అయ్యారు. ప్రస్తుతం 2 నుంచి 3 శాతం మంది కార్మికులు మాత్రమే అలా ఉంటారు. ఆ డిమాండ్ కూడా చేర్చారు.
-ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించిన టీబీజీకేఎస్ నేతలకు అండర్ గ్రౌండ్లో బొగ్గు తీసేందుకు ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన కంట్రాక్టర్ కు అప్పగించిన విషయం తెలియదా..? అని ప్రశ్నిస్తున్నారు. కేటీకే లాంగ్ వాల్ ప్రాజెక్టులో 1వ సీమ్, 2వ సీమ్ ప్రైవేటు వ్యక్తులకు కంట్రాక్టర్‌కు అప్పగించిన విషయాన్ని కార్మికులు గుర్తు చేస్తున్నారు.
కాగా,సింగరేణిలో అపరిష్కృతంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కార్మికులకు క్వార్టర్ల కేటాయింపు, పెర్క్స్ చెల్లింపు, కోల్ ఇండియాలో అమలు అవుతూ ఇక్కడ అమలు కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని వదిలిపెట్టి అప్రాధన్యమైన డిమాండ్లు నాలుగు ముందు పెట్టుకుని సమ్మెకు వెళ్లడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం తమ పట్టు నిలుపుకునేందుకు వచ్చే ఎన్నికల్లో కార్మికుల ముందుకు వెళ్లేందుకు తప్ప వేరే కాదని చెబుతున్నారు.