200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం
TSRTC:తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ. 6,700 కోట్లని అధికారులు వెల్లడించారు. దీన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్ల్లో తెలంగాణ ప్రభుత్వం సంబురాలు నిర్వహించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈ మహా లక్ష్మి పథకం ప్రారంభించారు. ఈ పథకం 9 డిసెంబర్ 2023 నుండి విజయవంతంగా అమలవుతోంది.
ఘనంగా సంబురాలు…
రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్ లలో సంబురాలు ఘనంగా నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. బస్ స్టేషన్లు, డిపోలు మొదలైన వాటిలో బ్యానర్లు ప్రదర్శించనున్నారు. సంబురాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలను ఆహ్వానించనున్నారు. కార్యక్రమంలో మహిళా ప్రయాణీకులు, కూరగాయల విక్రేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వ్యాపార మహిళలు, యాత్రికులను భాగస్వామ్యం చేసి ఉత్తమంగా ప్రసగించేవారికి బహుమతితో సత్కరించాలన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై విద్యార్థులకు వ్యాస రచన, రంగోలి, చిత్రలేఖనం నిర్వహించి బహుమతులను అందజేయనున్నారు. ఈ పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని ఐదుగురు ఉత్తమ డ్రైవర్లు , ఐదుగురు ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందిని సత్కరించేలా కార్యక్రమాలు రూపొందించారు.
మహిళా సాధికారత దిశగా అడుగులు : మంత్రి పొన్నం ప్రభాకర్
మహాలక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు , కండక్టర్ లు, శ్రామిక్ లు, ఇతర సిబ్బంది అధికారులకు కృతజ్ఞతలు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత , ఉద్యోగుల సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతున్నామన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, దూరపు ప్రాంత ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఆర్టీసీ వృద్ధి సాధించడం అభినందనీయం. ప్రతి మహిళా నెలకు 4-5 వేల రూపాయల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటున్నారు.