ప్ర‌పంచ మ‌హిళ‌ల చెస్ చాంపియ‌న్‌గా దివ్య‌దేశ్ ముఖ్‌

FIDE Women’s Chess World Cup: జార్జియా బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను యువ చతురంగ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని టై బ్రేకర్‌లో ఓడించి ఈ ఘనతను సాధించింది. ఫైనల్ పోరులో తొలి రెండు గేమ్స్‌ సమంగా ముగియడంతో, నిర్ణయాత్మకంగా సోమవారం నిర్వహించిన టై బ్రేక్‌ మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్ హంపిపై విజయం సాధించింది. ఈ విజయం ద్వారా దివ్య తన కెరీర్‌లో తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

బ్లాక్ పావులతో ఆడుతున్న హంపి ఓ తప్పిదం చేయడంతో దివ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. దీంతో దివ్య తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని సాధించి, భారత్ తరపున 4వ మహిళా గ్రాండ్ మాస్టర్‌‌గా అవతరించింది. ఈ విజయం ఆమెకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ కూడా సంపాదించిపెట్టింది. హంపి, వైశాలి, హారిక ద్రోణవల్లి తర్వాత గ్రాండ్‌మాస్టర్ అయిన నాల్గవ భారతీయ మహిళగా ఆమె నిలిచింది.

కేవలం 19 ఏళ్ల దివ్య ఈ టైటిల్‌ను గెలుచుకోవడం గమనార్హం. దీంతో ప్రపంచ కప్ గెలిచిన తొలి భారతీయ మహిళా చెస్ స్టార్‌గా ఆమె నిలిచింది. గత సంవత్సరం, దివ్య జూనియర్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మహిళల చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్‌గా కూడా నిలిచింది.

You might also like