ఈవీఎంలు వద్దు… బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురండి

-ఈసీని కోరిన బీఆర్ఎస్ బృందం
-కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేటీఆర్ బృందం
-ఈవీఎంలపై అనుమానాలున్నాయని వెల్లడి
-తమ కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని వినతి
-బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) నిలిపివేయాలని విజ్ఞప్తి

BRS team meets with the Central Election Commission: ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వాడకంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటి స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై చ‌ర్చించింది. ఈ విష‌యాల‌న్నీ బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో వెల్ల‌డించారు. ఈవీఎంల విశ్వసనీయతపై కొన్నేళ్లుగా సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. చాలా రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు కూడా జాతీయ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నాయని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో, ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని అమలు చేయాలని కోరామ‌న్నారు. బీహార్‌లో ప్రస్తుతం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు చేపట్టడం అనవసరమని చెప్పామ‌న్నారు. దీనివల్ల వలస కార్మికులు, బలహీన వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లు పెద్ద ఎత్తున తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

తమ పార్టీకి కేటాయించిన ‘కారు’ గుర్తును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్‌గా కేటాయించడంపై బీఆర్ఎస్ మరోసారి తన అభ్యంతరాన్ని వినిపించింది. ముఖ్యంగా కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, టీవీ వంటి 8 గుర్తులు బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలపై చిన్నగా కనిపించినప్పుడు ఓటర్లను, ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఈసీ దృష్టికి తీసుకువ‌చ్చామ‌న్నారు. ఈ గుర్తుల వల్ల గతంలో తమకు రావాల్సిన ఓట్లు పక్కదారి పట్టాయని, 2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో ఇదే జరిగిందని చెప్పిన‌ట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ ఎనిమిది గుర్తులను తక్షణమే తొలగించాలని కోరామ‌న్నారు. కేటీఆర్ నేతృత్వంలోని ఈ బృందంలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్, సీనియర్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like