పదవులు మీకే… పైసలు మీకేనా..?
Komatireddy Rajagopal Reddy:‘‘పదవులు మీరే తీసుకుంటున్నారు.. నిధులు కూడా మీరే తీసుకుంటున్నారు.. ఈ విషయాన్ని అడగాలా వద్దా?’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో జరిగిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొని మాట్లాడారు. 20 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు ఎలాగో ఇవ్వలేదు కనీసం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అయినా ఇవ్వండి అంటూ వ్యాఖ్యానించారు. మంత్రిని వందసార్లు కలిసినా ఫలితం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించక తప్పదని స్పష్టం చేశారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు. ఆ బిల్లులు ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే వస్తాయి. అందుకే నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి పదవులు మీకే.. పైసలూ మీకేనా? అని అడిగానని రాజగోపాల్ రెడ్డి వివరించారు.
కనీసం నాకు పదవి ఇవ్వనందుకు మా నియోజకవర్గానికి డబ్బులు అయినా ఇవ్వండి అని కోమటి రెడ్డి విమర్శించారు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి.. మునుగోడు నియోజకవర్గం సహకరించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజలు కోసం తనకు అన్యాయమైనా పర్వాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచివారిని ఎన్నుకోండి. నాతోపాటు ఉంటే నేను పోరాడుతాను. మళ్లీ ఎక్కడికైనా పోతే రమ్మంటే మళ్ళీ డబ్బులు అడిగే వారిని ఎన్నుకోకుండా మంచివారిని ఎన్నుకోండని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వడమనేది అధిష్ఠానం నిర్ణయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవి రావలసి ఉంటే ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.