కూలుతున్న‌య్‌… ఉరుస్తున్న‌య్‌..

Singareni:వేల కోట్ల ట‌ర్నోవ్‌.. వంద‌ల కోట్ల లాభాలు.. కార్మికుల సంక్షేమానికి కోట్ల‌లో నిధులు. ఇదంతా వింటే నిజ‌మే అనిపిస్తుంది క‌దా.. సింగ‌రేణి సంస్థ అన‌గానే వేల కోట్ల‌, వంద‌ల కోట్లు అనే ప‌దాలు త‌ప్ప వేరే వినిపించ‌వు.. అంత పెద్ద సంస్థ అయిన‌ప్పుడు స‌హ‌జంగానే కార్మికుల గురించి ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌నో అనిపించ‌కా మాన‌దు.. అయితే, ఇదంతా అధికారుల ఊక‌దంపుడు మాట‌లు త‌ప్ప వాస్త‌వానికి కార్మికుల‌కు క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో కూడా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు.. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ బెల్లంప‌ల్లిలోని సింగ‌రేణి క్వార్ట‌ర్లు…

ఎండ‌న‌కా.. వాన‌న‌కా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి ఇంటికి వచ్చే కార్మికుల‌కు క్వార్ట‌ర్ల‌లో ఉండే స‌మ‌స్య‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ముఖ్యంగా ఈ వ‌ర్షాకాలంలో క్వార్ట‌ర్లు ఉరుస్తున్నాయి. అధికారుల‌కు గ‌తంలో ఎన్నిమార్లు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కార్మికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలోని ప‌లు క్వార్ట‌ర్లు ఉరుస్తున్నాయి. దీంతో కార్మికులు వారి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

త‌న‌ క్వాటర్ శ్లాబ్‌ పగుళ్లు తేలి వర్షం నీరు ఇంట్లోకి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని సింగరేణి కార్మికుడు సిర్రా బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లంతా నీరు జాలు వారి నీళ్ల‌మ‌యం అవుతోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని క్వార్టర్లు మ‌ర‌మ‌త్తు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గోడు వెల్ల‌బోసుకుంటున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో సింగరేణి క్వార్టర్లలో కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నామని బాల‌కృష్ణ‌ ఆవేద వ్యక్తం చేశారు.

తాజాగా, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య నివాసం ఉంటున్న ఏ3 క్వార్ట‌ర్‌లో శ్లాబ్ కూలింది. అయితే, ఆయ‌న, కుటుంబ స‌భ్యులు అందులో లేకపోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. తాను రెండు రోజుల నుంచి ఇక్క‌డ లేక‌పోవ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య స్ప‌ష్టం చేశారు. ఎన్నోమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామ‌ని, మంద‌మ‌ర్రి జీఎంను స్వ‌యంగా క‌లిశామ‌న్నారు. అక్క‌డే నివాసం ఉంటున్నామ‌ని చెప్పినా నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌దేండ్లుగా సింగ‌రేణి క్వార్ట‌ర్‌కు అద్దె క‌డుతున్నామ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికైనా ఆ క్వార్ట‌ర్ మ‌ర‌మ్మ‌తు చేయాల‌ని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like