TBGKS గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్
TBGKS:అనుకున్నదంతా అయ్యింది.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయనను గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పదేండ్ల పదవి దూరం..
కల్వకుంట్ల కవిత దాదాపు పదేండ్ల పాటు ఆ యూనియన్‌కు గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు. కేటీఆర్, కవిత మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో సింగరేణిలో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా సింగరేణి జాగృతి పేరిట కమిటీలు వేశారు. అదే సమయంలో హిందూ మజ్ధూర్ సభ(హెచ్‌ఎంఎస్)తో ఆమె చర్చలు జరిపారు. ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తో కలిసి సింగరేణి జాగృతి ప్రతినిధులు, హెచ్‌ఎంఎస్ అన్ని డివిజన్ల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. తాను దసరా తర్వాత సింగరేణి యాత్ర చేపడతానని ప్రకటించారు. అదే సమయంలో కొన్ని సమావేశాల్లో తాను టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతూనే ఉన్నానని ప్రకటించారు కూడా. దీంతో కొద్ది రోజుల కిందట కొప్పుల ఈశ్వర్‌ను టీబీజీకేఎస్ ఇన్‌చార్జీగా ప్రకటించిన నేతలు, ఇప్పుడు ఆయనను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.
కొప్పుల ఈశ్వర్‌ను మొదట గౌరవ అధ్యక్షుడిగానే నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో ఆ నిర్ణయం వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు ఆయన నియామకం పూర్తి కావడంతో తెలంగాణ బొగ్గ గని కార్మిక సంఘం ఇక పూర్తి స్థాయిలో కార్యకలాపాలు చేపట్టనుంది. కార్మిక క్షేత్రంలోకి వెళ్లి సమస్యలపై పోరాటం చేసేందుకు సమాయత్తం అవుతోంది.