పార్లమెంట్‌లో గందరగోళం..

అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లు ప‌త్రాల‌ను చించేసిన ప్రతిపక్షాలు

పార్లమెంట్‌లో బుధ‌వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ కొత్త సవరణ బిల్లు ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ అయ్యి, 30 రోజులకు పైగా జైలులో ఉంటే, వారు తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 75, 164, 239AA లను సవరించడానికి ఉద్దేశించిన‌ 113వ సవరణ బిల్లు 2025ను హోం శాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. అయితే, ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించారు.

ప్రతిపక్ష ఎంపీలు బిల్లుల ప్రతులను చించి సభలో విసిరేశారు. నినాదాలు చేస్తూ వెల్‌ వైపు దూసుకెళ్లారు. గుజరాత్‌ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్‌ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ లేవనెత్తారు. దీనికి సమాధానమిస్తూ అమిత్‌ షా, తాను అరెస్టు కాకముందే నైతిక కారణాల దృష్ట్యా పదవి నుంచి రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా తేల్చిన తర్వాతే మళ్లీ ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారెవ్వరూ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం సరైంది కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సంద‌ర్భంగా అధికార పక్షం-విపక్షం మధ్య వాగ్వాదం తలెత్తింది. ప్రతిపక్ష నిరసనలు కొనసాగుతుండటంతో చివరికి సభ వాయిదా వేయాల్సి వచ్చింది.

You might also like