ప్రైవేటు కంపెనీల శ్రమ దోపిడీ
జీతాలు సక్రమంగా చెల్లించని వైనం - సౌకర్యాల కల్పనలో పూర్తి స్థాయిలో విఫలం - పట్టించుకోని సింగరేణి, కార్మిక శాఖ అధికారులు - ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కంపెనీ ప్రతినిధులు
మంచిర్యాల – సింగరేణికి సంబంధించి ఆఫ్‌లోడింగ్ వర్కర్లకు ప్రైవేటు కంట్రాక్టర్ కంపెనీలు శ్రమ దోపిడీ చేస్తున్నాయి. వారికి జీతాలు సక్రమంగా ఇవ్వకుండా పనుల విషయంలో వేధింపులకు గురి చేస్తున్నారు. చాలీ చాలని జీతాలతో పని ఒత్తిడి మధ్య కార్మికులు నలిగిపోతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన సింగరేణి యాజమాన్యం కానీ, కార్మిక శాఖ అధికారులు కానీ కనీసం పట్టించుకోకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణిలో ఓవర్ బర్డెన్ తీసేందుకు ఆ సంస్థ ప్రైవేటు కంపెనీలకు టెండర్లు ఇస్తుంది. ఆ కంపెనీలు ఓవర్‌బర్డెన్ (బొగ్గు కంటే ముందు ఉంటే మట్టి) తీసి బొగ్గును సింగరేణికి అప్పగిస్తాయి. ఆ బొగ్గును సింగరేణి తీసుకుంటుంది. అయితే ఈ ప్రైవేటు కంపెనీలు కార్మికులకు ఇవ్వాలని జీతాలు సక్రమంగా ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించకుండా పని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీంతో ఆ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు నానా ఇబ్బందుల మధ్య అష్టకష్టాలు పడుతున్నారు. తమ జీతాలు పెంచాలని ఎవరైనా అడిగితే వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవ్వాల్సింది రూ. 1,030.. ఇచ్చేది రూ. 653
బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్‌కాస్టు వద్ద ఉన్న జీఆర్ఎన్ కంపెనీ కార్మికులకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. ఇక్కడ జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. జీవో ప్రకారం వారికి రూ. 1030 ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడు మాత్రం కేవలం రూ. 653 మాత్రమే ఇస్తున్నారు. వారికి టీఏ, డీఏ, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ అవేవీ అందించడం లేదు. ప్రతి నెలా ఒక్క కార్మికుడికి పది వేలకు పైగా మిగిలించుకుంటున్నారు. ఇక్కడ దాదాపు ఆరు వందల కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల పేరిట 40 లక్షల వరకు మిగులుతున్నాయి. టీఏ, డీఏల పేరిట సైతం పెద్ద ఎత్తున డబ్బులు కాజేస్తున్నారు. ఇంకా కల్పించాల్సిన మిగతా సౌకర్యాలు కూడా కార్మికులకు కల్పించడకపోవడంతో ప్రతి నెలా 70 లక్షలకు పైగా కార్మికుల పైసలకు గండి కొడుతున్నారు.
కార్మిక చట్టాలు వారికి చుట్టాలు..
ఇక్కడ కార్మిక చట్టాలు ఏ మాత్రం అమలు కావు. కార్మికులకు సంబంధించి వారు ఏం చెబితే అది చేయాలి…? లేకపోతే వేధింపులు తప్పడం లేదు. కార్మికులకు టీ తాగేందుకు సమయం ఉండదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. టీ సమయం అరగంట వరకు ఇవ్వాలి. రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వడం లేదు. ఇక భోజనానికి సమయం కూడా పది నుంచి ఇరవై నిమిషాలకు మించి ఇస్తలేరు. దీంతో కార్మికులపై పని ఒత్తిడి పెరుగుతోంది. అంతేకాకుండా కార్మికులు ఆరోగ్యం బాగాలేక గైర్హాజర్ అయితే వారిని మూడు రోజుల పాటు విధుల్లోకి తీసుకోవడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని లక్ష్యంగా చేసుకుని విధుల్లో నుంచి తీసివేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిద్ర నటిస్తున్న సింగరేణి, కార్మిక శాఖ అధికారులు..
ఇక ఈ విషయంలో నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు తమకు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్మిక చట్టాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి.. వారికి జీతాలు సక్రమంగా అందుతున్నాయా..? లేదా..? వారికి ఏయే సౌకర్యాలు అందిస్తున్నారు..? ఇంకా అందిచాల్సినవి ఏమైనా ఉన్నాయా…? అనే దానిపై నిత్యం సమీక్షించాల్సి ఉండగా, వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా అటు సింగరేణి, ఇటు కార్మిక శాఖ అధికారులు ముడుపులు ముడుతుండటం వల్లనే ఏ మాత్రం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు దుయ్యబడుతున్నారు.
ప్రమాదకర పరిస్థితుల్లో బ్లాస్టింగ్…
ఈ కంపెనీకి సంబంధించి మరిన్ని ప్రమాదకర అంశాలు తెర పైకి వస్తున్నాయి. ముఖ్యంగా సింగరేణిలో బ్లాస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో దగ్గర్లో ఎవరూ ఉండరాదు. వాహనాలు సైతం దగ్గర ఉంచొద్దు. కనీసం 500 మీటర్ల దూరం ఉండాలి. కానీ, జీఆర్ఎన్ కంపెనీకి సంబంధించి పని స్థలాలకు దగ్గరల్లోనే వాహనాలు ఉంచుతున్నారు. బ్లాస్టింగ్ అయిన వెంటనే ఓవర్‌బర్డెన్ తరలించేందుకు ఈ విధంగా చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే గోదావరిఖని ఏరియాలో మహాలక్ష్మి కంపెనీలో జరిగిన విధంగా ప్రాణనష్టం సంభవిస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రమాదాలు సంభవించకుండా కార్మికులు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విభజించు పాలించు సూత్రం..
ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఈ కంపెనీ కార్మికులను విభజించి పాలించే సూత్రాన్ని పాటిస్తోంది. కొందరు కార్మికులను, స్థానిక ప్రజాప్రతినిధులను దగ్గర పెట్టుకుని వ్యవహారం నడిపిస్తోంది. చాలా మందికి నెల నెల మామూళ్లు ఇస్తూ కార్మికులను మాత్రం రాచి రంపాన పెడుతోంది. తమకు జీతాలు సక్రమంగా చెల్లించకపోతే సమ్మెకు వెళ్తామని కార్మికులు హెచ్చిరించినా పట్టించుకోలేదు. అధికారులు, నేతలు తమకు అండగా ఉంటారనే ధైర్యంతో వారిని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు కార్మికులకు సంబంధించి జీతాలు సక్రమంగా చెల్లించేలా చూడాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. సింగరేణి అధికారులు, కార్మిక శాఖ అధికారులు ఈ విషయంలో కలుగచేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఇక కార్మిక సంఘ నేతలు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.