35 శాతం లాభాల వాటా చెల్లించాలి

టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్

Singareni:సింగ‌రేణిలో 2024 -25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి వెంటనే లాభాలలో 35 శాతం చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా గోలేటి CHP లో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తిరిగి తీసుకువచ్చిన మెడికల్ బోర్డు గత మార్చి నుండి సింగరేణి యాజమాన్యం నిలిపివేసినా కూడా గుర్తింపు సంఘం ఏఐటియూసీ, ప్రభుత్వ సంఘమైన ఐఎన్టీయూసీ చూస్తూ ఊరుకున్నారు తప్ప యాజమాన్యంపై ఒత్తిడి తేవడం లేదని ఇది వారి వైఫల్యం అని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు.

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో లాభాల వాటా చెల్లించాలని మెడికల్ బోర్డు నిర్వహించాలని తదితర 10 డిమాండ్లను పరిష్కరించాలని టీబీజీకేఎస్ ఆందోళ‌న‌లు నిర్వ‌హించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఆ డిమాండ్ల‌తో సెప్టెంబర్ 2న కార్మికులతో నల్లబ్యాడ్జీలు ధ‌రించ‌డ‌మే కాకుండా, జీఎం కార్యాల‌యాల ఎదుట ఆందోళ‌న‌, కొత్తగూడెంలో సైతం ధర్నా చేశామ‌న్నారు. అయినా, యాజమాన్యంలో ఉలుకు పలుకు లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, గుర్తింపు సంఘం స్పందించి సమస్యను పరిష్కరించాలని లేక‌పోతే కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ అవసరమైతే హైదరాబాద్ స్థాయిలో టిఆర్ఎస్ మద్దతు తీసుకొని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

250 గజాల భూమి ఇస్తామని, ఇన్‌కంటాక్స్‌ రద్దు చేస్తామని, గృహ రుణ వడ్డీ 30 లక్షలకు పెంచి ఇప్పిస్తామని గుర్తింపు సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులకు లాభాలలో వాటా 20 వేలకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోలేటి సీహెచ్‌పీ ఫిట్ కార్యదర్శి మేరుగు రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ధరావత్ మంగీలాల్, ఏరియా కార్యదర్శిలు అలవేణి సంపత్, మారిన వెంకటేశ్వర్లు, సెంట్రల్ కమిటీ నాయకులు చంద్రశేఖర్, మంతు సమ్మయ్య, ఆర్ శ్రీనివాస్, ఓ కిరణ్, వెంకన్న నాయకులు మురళీకృష్ణ, విద్యాసాగర్, చిరంజీవి, సుగ్రీవులు, అజాస్, శ్రీనివాస్, వీరస్వామి, వరలక్ష్మి, ఆఫీసు ఇంచార్జి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like