బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు

Terrorist movements in Bodhan:నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. పట్టణంలో ఉగ్రవాది ఉంటున్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు దాడి చేసిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాది పట్టణంలోని అనీసనగర్‌‌కు చెందిన మ‌హ్మ‌ద్ ఉజైఫా యామ‌న్ ను అరెస్టు చేశారు. అతడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఉజైఫా యామ‌న్ బీ ఫార్మ‌సీ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. కొద్ది రోజుల కింద‌ట అషర్ డానిష్ అనే వ్య‌క్తిని జార్ఖండ్‌లోని రాంచీలో అరెస్ట్ చేశారు. అనంతరం అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి నిఘా బృందాలు. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని బోధన్ పట్టణంలో కూడా జల్లెడ పట్ట‌గా మ‌హ్మ‌ద్ ఉజైఫా యామ‌న్ చిక్కాడు.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. పక్కా సమాచారం మేరకు ఉజైఫా యామ‌న్‌ను అరెస్టు చేశారు. అనంతరం బోధన్​ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం అధికారికంగా విషయాలు వెల్లడించలేదు. గతంలోనూ బోధన్ పట్టణంలో ఉగ్రలింకులకు సంబంధించి ఎన్‌ఐఎ సహా పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టాయి. ఉగ్ర లింకులు కలిగిన వారిపై ఆరా తీశాయి. ప్రత్యేకించి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఇక్కడి నుంచే పాస్‌పోర్టులు జారీ అయిన ఉదంతం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్న వ్యక్తి పట్టుబడడం క‌ల‌క‌లం రేగింది.

You might also like