23న కవితక్క మంచిర్యాలకు రాక
Kalvakuntla Kavitha:ఈ నెల 23న తెలంగాణ జాగృతి అధినేత, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాకు రానున్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో భారీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ రోజు ఆమె పర్యటన ఖరారు చేశారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో 23న రానున్నారు. ఆమె ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనకుండా కేవలం శ్రీరాంపూర్‌లోనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. చింతమడక, తెలంగాణ జాగృతి కార్యాలయాల్లో సైతం చిన్నగానే వేడుకల్లో పాల్గొననున్న కవిత, శ్రీరాంపూర్‌లో మాత్రం బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే కార్యక్రమం రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి సభ్యులు అన్ని ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాల నియోజకవర్గంతో పాటు సింగరేణి కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్న కవిత ఇక్కడ బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక్కడే ఎందుకంటే..?
కల్వకుంట్ల కవిత రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేలా.. రాష్ట్రప్రజలతో మమేకం అయ్యేందుకు వీలుగా ఎమ్మెల్యే కావాలని ఆమె భావిస్తున్నారు. ఎమ్మెల్యే అయితే.. రాష్ట్ర రాజకీయాల్లోకి నేరుగా ఇన్ వాల్వ్ కావొచ్చన్న ఆలోచనలో కవితక్క ఉన్నట్లుగా చెబుతున్నారు. తన ప్లాన్ అమల్లో భాగంగా ఆమె ఇప్పటికే రెండు నియోజకవర్గాలపై కన్నేశారు. గతంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని భావించిన కల్వకుంట్ల కవితకు అది సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న కవిత అయితే, మంచిర్యాల లేదంటే నిజామాబాద్ నుంచి పోటీ చేయనున్నారు.
రెండు రకాలుగా ప్రయోజనం జరిగేలా..
అటు రాజకీయంగా తన ప్రాబల్యం పెంచుకోవడంతో పాటు ఇటు తాను అధ్యక్షురాలిగా ఎన్నికైన హెచ్ఎంఎస్ను బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సింగరేణి ప్రాంతమైన శ్రీరాంపూర్‌ను ఎంచుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితులు ఏంటి..? తనకు ఏ మేరకు మద్దతు లభిస్తుంది…? అటు నియోజకవర్గం నుంచి, ఇటు సింగరేణి నుంచి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది..? ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని ఇక్కడ భారీగా కార్యక్రమం నిర్వహించనున్నారు.