దూసుకువస్తున్న వరుస అల్పపీడనాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో సతమతం అవుతున్న రెండు రాష్ట్రాలకు ఈ అల్పపీడనాలతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు ఓ అల్పపీడనం ఏర్పడనుంది. కాగా, 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో 25 నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో ఈ నెల 26నాటికి..
ఇక, తెలంగాణలో తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయువ్యదిశలో కదిలి వాయువ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈనెల 26 నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆపై వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తేదీ నాటికి తీరాన్ని దాటనునన్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని.. అలాగే అక్కడక్కడ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ రోజు భారీ వర్షాలు..
తెలంగాణలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. నిన్న కూడా జనగాం, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.