కదిలే రైలు నుంచి క్షిపణి ప్రయోగం..
Agni Prime Missile: అటు రఫెల్, ఇటు బ్రహ్మెస్… వీటన్నింటితో భారత్ శత్రువుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా భారత్ చేసిన క్షిపణి ప్రయోగంతో శత్రుదేశాల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత్ రైళ్ల నుంచి కూడా మిసైళ్లను ప్రయోగించగలదని ఈ ప్రయోగం నిరరూపించింది. కాగా, రైళ్ల నుంచి క్షిపణి ప్రయోగించిన తొలి దేశం భారత్ కావడం గమనార్హం. ఈ క్షిపణులను రైళ్లే మోసుకెళతాయి.
DRDO రూపొందించిన ఈ అగ్ని-ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ (Rail-Based Mobile Launcher) నుంచి పరీక్షించారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారత రక్షణ సామర్థ్యానికి ఒక కొత్త మైలురాయిగా యుద్దనిపుణులు భావిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించిన ‘అగ్ని ప్రైమ్’ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ క్షిపణి ఎటువంటి పరిమితులు లేకుండా దేశం నలుమూలలకు స్వేచ్చగా కదలగలదు. దీనిని ఎక్కడైనా దాచి పెట్టవచ్చు. అవసరమైన చోట అత్యవసరంగా ప్రయోగించడానికి సులువుగా ఉంటుంది. సాయుధ దళాలకు తక్కువ సమయంలో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది భారతదేశం డిఫెన్స్ సిస్టమ్ ను బలపరుస్తుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
అగ్ని-ప్రైమ్ క్షిపణి యొక్క లక్షణాలు
అగ్ని-ప్రైమ్ అనేది దాదాపు 2,000 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్‌తో కూడిన అధునాతన తదుపరి తరం ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఇది అనేక ఆధునిక లక్షణాలతో అమర్చారు. అగ్ని క్షిపణి సిరీస్ వెర్షన్‌లతో పోలిస్తే మెరుగైన ఖచ్చితత్వం, విశ్వసనీయత, కార్యాచరణ సౌలభ్యాన్ని ఇస్తుంది. ఈ ట్రయల్‌లో ఉపయోగించిన టెక్నాలజీని భవిష్యత్తులో ఇతర అగ్ని-క్లాస్ క్షిపణులకు కూడా అన్వయించవచ్చని అధికారులు నిర్ధారించారు.
అభినందనలు తెలిపిన రాజ్‌నాథ్ సింగ్..
“ఇండియా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుండి ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి 2000 కి.మీ వరకు పరిధిని కవర్ చేయడానికి రూపొందించబడింది. దీంతోపాటే వివిధ అధునాతన లక్షణాలు అమర్చబడి ఉన్నాయి. ” అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ Xలో పోస్ట్ చేశారు. నడిచే రైలు నుంచి ‘క్యానిస్టరైజ్డ్ లాంచ్ సిస్టమ్’ అభివృద్ధి చేసిన దేశాలలో భారత్ చేరిందని రక్షణ మంత్రి నొక్కి చెప్పారు. ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు DRDO, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC), సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు.