మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల లెక్క‌.. ఇక్క‌డ కూడా అయితే ఎట్ల‌…?

Telangana Local Body Elections: ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తాం… గెలుస్తాం.. మ‌రి ఎన్నిక‌ల విష‌యంలో కోర్టు ఏం నిర్ణ‌యం తీసుకుంటుంది..? ఒక‌వేళ అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుంటే స‌రే.. మ‌రి, మ‌హారాష్ట్ర లెక్క‌న ఎన్నిక‌లే ర‌ద్దు చేస్తే మ‌న ప‌రిస్థితి ఏంటి..? చేసిన ఖ‌ర్చంతా వృథా క‌దా..? ఇప్పుడు పోటీ చేయ‌కుండా ఆగుదామంటే అనుకూల నిర్ణ‌యం వ‌స్తే ఎలా ఉంటుంది.. ఇదీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకునే చాలా మంది అభ్య‌ర్థుల ఆందోళ‌న‌..

తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రోజుకో మ‌లుపు తీసుకుంటున్నాయి. ఎన్నిక‌ల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావ‌హులు ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు సిద్ధం అన‌గానే ఎగిరి గంతేశారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గానే హ‌మ్మ‌య్య అనుకున్నారు. కానీ, వారి ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లుతూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది. అక్టోబర్‌ 8న కోర్టు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉంటాయా..? లేదా..? అనేది తేల్చనుంది.

అయితే, ఇక్క‌డే మ‌న ప‌క్క రాష్ట్రమైన‌ మహారాష్ట్ర ఎన్నిక‌ల సీన్ గుర్తు చేస్తున్నారు కొంద‌రు. మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో 50శాతం లిమిట్‌ను దాటి..రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు వెళ్లింది. ఎన్నికలు అయిపోయాయి. స్థానిక ఎన్నికల కూడా ఫలితాలు వచ్చాయి. తర్వాత ఆరు నెలలకు కోర్టు విచారణ చేపట్టి ఎన్నికల్లో గెలిచిన వారి సభ్యత్వాలను రద్దు చేసింది. మళ్లీ రిజర్వేషన్ల కోటా 50శాతానికి లోబడి ఎన్నికలు పెట్టాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మహారాష్ట్రలో మళ్లీ స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50శాతం రిజర్వేషన్ దాటొద్దన్న నిబంధనను అతిక్రమించడానికి వీళ్లేదు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఇప్పట్లో సాధ్యం కాదని ప‌లువురు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుద‌ల‌ చేసింది కాబట్టి.. ఎన్నికలు ఆపొద్దు అనుకుంటే చట్టప్రకారం బీసీ రిజర్వేషన్లు అమ‌లు కాకుండానే ఎన్నిక‌లు జ‌ర‌ప‌వ‌చ్చు.. ఒకవేళ బీసీ కోటా అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మరోసారి వాయిదా పడటం ఖాయమని ప‌లువురు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like