కలిసి వెళ్తారా..? కొట్టుకుంటారా..?
సింగరేణి సమ్మెకు కలిసి వెళ్లాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా ఐదు జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. తాము సమ్మె చేస్తున్న విషయంలో కార్మికులకు అవగాహన కల్పించి వారి మద్దతు కూడగట్టాల్సిన కార్మిక సంఘ నేతలు ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారు. సమ్మె ద్వారా పట్టు నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరంతా సమ్మెకు కలిసి వెళ్తారా..? లేదా…? అనే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణతో సహా పలు అంశాలపై సమ్మెకు వెళ్లాలని సింగరేణిలో కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మొదట అందరూ కలిసి వెళ్లాలని జాతీయ కార్మిక సంఘాలు భావించాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావ్‌కు ఈ విషయం చెప్పాయి. దీంతో సమ్మె క్రెడిట్ తాము కొట్టేలాయనే ఉద్దేశంతో టీబీజీకేఎస్ ముందుగానే సమ్మె ప్రకటన చేసింది. షాక్ తినడం జాతీయ కార్మిక సంఘాల వంతైంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గత నెల 25న సమ్మె నోటీసు ఇవ్వగా 30న అన్ని జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ రెండు సార్లు ఉన్నా సమ్మె నోటీసులు ఇవ్వడం ఇదే మొదటి సారి.
చివరగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో చర్చలు జరిపిన జాతీయ కార్మిక సంఘాల నేతలు కలిసి సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కార్మిక సంఘా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో పోరాటం చేసేందుకు వారంతా చర్చించుకుని దానిని అమలు చేస్తున్నారు. గనుల వద్దకు వెళ్లి కార్మికులకు సమ్మె పట్ల అవగాహన కల్పించడమే కాకుండా, వారి మద్దతు కూడగట్టేందుకు నేతలు ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నేతలు గనుల వద్దకు వెళ్లి సమ్మెపై ప్రచారం కూడా చేస్తున్నారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది… కానీ నేతలు సమ్మెకు సంబంధించిన విషయాలు కార్మికులకు అవగాహన కల్పించే బదులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ, ఇతర డిమాండ్లపై మాట్లాడాల్సి ఉండగా, పార్టీలు.. యూనియన్లపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది కాస్తా వివాదాలకు దారి తీస్తోంది. ఆర్‌కే 7 గనిపై గేట్ మీటింగ్‌లో హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు. దీంతో పక్కనే ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావ్ మైక్ గుంజుకున్నంత పని చేశారు. ఇక కేకే5లో పర్వతి రాజిరెడ్డి మోదీని తిడుతున్న సమయంలో బీఎంఎస్ నేతలు అడ్డుకున్నారు.
ఇలా నేతలు మైకులు పట్టుకోగానే తమను తాము మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా సమ్మెకు వెళ్లి సింగరేణిని దిగ్బందించాల్సింది పోయి ఒక యూనియన్ లేదా వ్యక్తులను తిట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు..? దాని ఎదుటి సంఘం నేతలు గొడవ చేస్తారనే విషయం తెలిసి కూడా నేతలు ఇలాంటివి చేయడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. మరి నేతలు ఇప్పటికైనా మారతారో..? లేక సింగరేణి సమ్మెకు సంబంధించి లబ్ధి పొందేందుకు ఈ వ్యక్తిగత విమర్శలు కంటిన్యూ చేస్తారో..? వేచి చూడాల్సిందే..