హర్మూజ్ తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటన
Iran announces opening of Hormuz:ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి తెరుస్తున్నట్లు వెల్లడించింది. ఈ కాల్పుల విరమణ అమలులో ఉన్నంత వరకు హర్మూజ్ తెరిచి ఉంచుతామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరగ్బీ ప్రకటించారు. ఈ జలమార్గం ద్వారా అన్ని దేశాలు రాకపోకలు సాగించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య పదిరోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు ఇజ్రాయిల్, లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం సహకరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు… ఇరాన్ హర్మూజ్ జలసంధి తెరుస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం వెల్లడించారు. దీంతో నౌకలు పూర్తి స్థాయిలో రవాణా కొనసాగిస్తాయని, ఇరాన్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ ప్రకటనతో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 90 డాలర్లకు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లకు చేరకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గడంతో దిగుమతులపై ఆధారపడ్డ భారత్ వంటి దేశాలకు లాభం చేకూరనుంది.