హైటెన్షన్ వైర్లు పట్టుకుని నిరసన

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో హై ఓల్టేజ్ వైర్లను పట్టుకుని విద్యుత్ సిబ్బంది నిరసన చేశారు. తమ పై టిఆర్ఎస్ కౌన్సిలర్ దౌర్జన్యం చేసారని, అడ్డు వస్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే చెన్నూరు మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పులో వ్యాపారులు దుకాణాలు కోల్పోయారు. ఖాళీగా ఉన్న చెన్నూర్ విద్యుత్ సబ్ స్టేషన్ భూమిలో తిరిగి దుకాణాల కట్టించి ఇవ్వాలని మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా సబ్ స్టషన్ భూమిలో సోమవారం ముగ్గు పోశారు. స్థానిక విద్యుత్ ఎఈ రామ్మూర్తి, జె ఎల్ ఎం లు పాషా, సృజన అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనితో తమపై టిఆర్ఎస్ కౌన్సిలర్ దౌర్జన్యం చేసారని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు.టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు విద్యుత్ ఉద్యోగుల పై దాడికి నిరసనగా పట్టణ సబ్ స్టేషన్లు మెయిన్ ట్రాన్స్ఫార్మర్ల విద్యుత్ సరఫరా నిలిపివేసి వాటిపై కూర్చుండి నిరసన తెలిపారు.